రైలు పట్టాలపై సెల్ఫీలు.. నలుగురి మృతి
జనాలకు సెల్ఫీల పిచ్చి ముదిరిపోతోంది. ఎక్కడ ఉన్నా… ఏం చేస్తున్నా… సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం.. అలవాటుగా మారిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాల మీదకు వస్తోంది. పట్టాలపై సెల్ఫీలు తీసుకుంటున్న నలుగురు యువకులపై రైలు దూసుకువెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ప్రమాదం సంభవించింది.
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో నలుగురు యువకులు బైక్‌లపై ధన్‌కోట్ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వచ్చారు. పట్టాలపైనే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే సమయంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వచ్చి వారి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. వారి మృతదేహాలను 500 మీటర్ల వరకు రైలు ఈడ్చెకెళ్లింది. మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. గుర్తు పట్టరాని విధంగా మారిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మంగళవారం పశ్చిమ బెంగాల్‌లో ఓ యువకుడు ఇలాగే చనిపోయాడు. సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో మరణించాడు. రైలు పట్టాలపై నడవకూడదని అధికారులు హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.