జంపన్న వాగులో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మృతి
మేడారంలో జాతర ఘనంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాకతో మేడారం కిక్కిరిసిపోతోంది. జాతరలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు అని జంపన్న వాగులోకి వెళ్లిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి.. ఆ వాగులో పడి మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం తిలక్ నగర్ కు చెందిన శాద నర్సయ్య (63) సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో కలిసి జాతర వెళ్లారు. నర్సయ్య జంపన్న వాగులో స్నానం చేద్దామనుకున్నాడు. స్నానం కోసం అని వాగులోకి వెళ్లిన ఆయన ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పి బ్రిడ్డి కింద ఉన్న గుంతల్లో పడిపోయాడు. దీనిని గమనించిన కుమారుడు అశోక్ తండ్రిని వెంటనే బయటకు తీశాడు. సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. కానీ హాస్పిటల్ కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
నరసయ్య కొత్తగూడెం పరిధిలోని సింగరేణి గనిలో పని చేశారు. 2019 డిసెంబర్ నెలలో రిటైర్డ్ అయ్యారు. ఆయనకు భార్య సరోజ, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారందరికీ పెళ్లిల్లు అయిపోయాయి. ఫ్యామిలీ మొత్తంతో కలిసి సమ్మక్క, సారక్క జాతరకు సంతోషంగా వెళ్లారు. ఈ ఘటన తో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.