కేసీఆర్‌తో విబేధాలు లేవు

సీఎం కేసీఆర్‌తో విభేదాలు తలెత్తాయని వస్తున్న ఊహాగానాలపై చినజీయర్ స్వామి స్పందించారు. ఆయనతో తమకు ఎందుకు విభేదాలు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ పూర్తి సహకారం ఉన్నందుకే రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ఈ కార్యక్రమానికి తాను మొదటి సేవకుడినని కేసీఆరే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం లేదా పనుల ఒత్తిడి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. రేపు జరగనున్న శాంతి కళ్యాణానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని చెప్పిన చినజీయర్ స్వామి..ఆయన వస్తారో రారో చూడాలని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన.. సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి మధ్య చిచ్చురేపినట్లు ప్రచారం జరుగుతోంది. రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని పర్యటనతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్ పర్యటనకు కూడా దూరంగా ఉన్న సీఎం కేసీఆర్.. ముగింపు వేడుకలకు సైతం రాకపోవడంతో ఆయన చినజీయర్‌పై ఆయన ఇంకా ఆగ్రహంతోనే ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంతో ఈ వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. సీఎం పేరు లేని విషయంపై సమాచారం అధికార వర్గాల ద్వారా సీఎంవోకు ముందుగానే అందినట్టు సమాచారం. కొందరు చినజీయర్ ఆశ్రమంలోని వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మంచిదనే సంకేతాలను సీఎంకు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి.