ఆ నిర్మాణాలకు పరిహారం రాదు
బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి
మంచిర్యాల : కొందరు దళారుల మాటలు నమ్మి కోల్ బేరింగ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అలాంటి వాటికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వమని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఎంవీకె -5 ఇంక్లైన్, ఎంవీకె-3 ఇంక్లైన్, పోచంపల్లి, వడ్డెర కాలనీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతాలను కోల్‌బేరింగ్ ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఆయా గ్రామాల పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలు కడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటివి కట్టి ప్రయోజనం లేదని అక్కడి గ్రామస్తులకు వివరించారు. అలాంటి అక్రమ నిర్మాణాలకు సింగరేణి యాజమాన్యం ఎలాంటి నష్టం పరిహారం చెల్లించదని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయంలో దళారుల మాటలు నమ్మవద్దని ఆయన వెల్లడించారు. తాండూరు ఎమ్మార్వోని కలిసి ఈ అక్రమ నిర్మాణాలు, కట్టడాలు గురించి తన దృష్టికి తీసుకువెళ్లారు. వాటి గురించి విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత గ్రామాధికారులకి ఎలాంటి నిర్మాణాలకు అనుమతించ వద్దని అదేశించవలసిందిగా కోరారు. ఈ పర్యటనలతో జీఎంతో పాటు బీపీఏ ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఉన్నారు.