రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉండగా ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. అదే సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. సరిగ్గా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి వచ్చేసరికి అతివేగంతో అదుపుతప్పి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కూలీలపైకి అతివేగంగా దూసుకొచ్చేసింది. ఊహించని ఘటనతో కంగారుపడిన కూలీలు తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
అడ్డొచ్చిన వారిని ఢీకొంటూ కాస్తదూరం వెళ్లాక బస్సు ఆగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను భువనగిరి మండలం రాయగిరికి చెందిన అంకర్ల లక్ష్మీ, అంకర్ల కవిత, ఊరేళ్ల శ్యామ్ గా గుర్తించారు. వీరిలో శ్యామ్ అనే వ్యక్తి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూలీలను అక్కడ దించేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆలేరు ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జనగామ-హైదరాబాద్ రహదారిపై కొద్దిసే ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రాకపోకలు పునరుద్ధరించారు. మృతుల బంధువుల రోదనలతో సంఘటనా స్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.