13,700 మంది విద్యార్థుల తరలింపు
ఉక్రెయిన్ నుంచి 13,700 మంది విద్యార్థులను తరలించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. విద్యార్థులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం విజయవంతం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పూణెలో పర్యటిస్తున్న ప్రధాని సింబయాసిస్ యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా శక్తిమంతం కావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. “ఆపరేషన్ గంగా ద్వారా వేలాది మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి సురక్షితంగా తరలిస్తున్నాం. భారతదేశం బలోపేతం అవుతునందు వల్లే ఉక్రెయిన్‌లోని యుద్ద ప్రాంతం నుంచి వేలాది మంది విద్యార్థులను వారి మాతృభూమికి తిరిగి తీసుకువచ్చింద”ని మోదీ అన్నారు.
తమ దేశ పౌరులను తరలించేందుకు చాలా పెద్ద దేశాలు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నాయని మోదీ అన్నారు. కాగా ఇప్పటికే వరకు ఉక్రెయిన్‌లో ఉండిపోయిన 13,700 మంది విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు తెచ్చినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులు ఉన్నారు. వారిని కూడా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు.