వేజ్‌బోర్డు ఆలస్యంతో కార్మికులకు తీవ్ర నష్టం
ఆర్ జి 2 ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్
మంచిర్యాల : పదకొండవ బోర్డ్ ఆలస్యంతో కార్మికులకు తీవ్రమైన ఆర్థిక నష్టం చేకూరుతుందని టీబీజీకేఎస్ ఆర్ జి 2 ఉపాధ్యక్షుడు అయిలి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఓసీపీ త్రీ బేస్ వర్క్ షాప్ లో జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవ వేజ్ బోర్డు జాప్యం వల్ల తక్కువ ఫిట్మెంట్ ఒప్పందం చేసుకుని వచ్చారని, ఇప్పుడు కూడా అదే రకంగా కనబడుతోందన్నారు. జాతీయ సంఘం నాయకులు వేజ్ బోర్డు లో ఎక్కువ ఫిట్మెంట్ చేసుకోవాల్సిన దాన్ని మర్చిపోయి కార్మికులకు నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమయం ముగిసిందని జాతీయ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి పదే పదే ఆర్ఎల్సీ, కోర్టుకు వెళ్తున్నాయని చెప్పారు. అదే ఉత్సాహం వేజ్‌బోర్డు ఒప్పందంలో ఎందుకు కనిపించడం లేదని అన్నారు. ఇప్పటికైనా కార్మికవర్గం వేజ్ బోర్డు గురించి జాతీయ సంఘం నాయకుల్ని నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అవునూరి రాజేశం,కర్క శ్రీనివాస్,అంజయ్య,సుధాకర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, రమేష్, అనిల్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.