పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన కన్నతల్లి

అమ్మ ప్రేమ‌ను మించింది లేదంటారు ఈ లోకంలో.. ఆమె ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది.. బ‌ల‌మైంది కూడా. అటువంటి బంధాన్ని కొంద‌రు అప‌హాస్యం చేస్తున్నారు. తాజాగా, ఓ తల్లి అప్పుడే పుట్టిన పసిగుడ్డును భూమిలో సజీవంగా పాతిపెట్టిన ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌స్తీ జిల్లాలో జ‌రిగింది.

ఓ తల్లి నవమాసాలు తన కడుపులో మోసిన బిడ్డను పుట్టిన వెంటనే ప్రాణాలతో ఉండగానే పాతిపెట్టింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బస్తీ జిల్లా ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సజీవంగా ఉన్న ఆ చిన్నారి ఏడుపు ఓ మహిళకు వినబడటంతో ఆమె పరుగెత్తుకుంటూ అక్కడకు చేరుకుంది. ఆసుపత్రి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భూమిలో సగం పాతిపెట్టిన శిశువు ఆమె కంటబడింది.

వెంటనే ఆమె ఆస్పత్రి సిబ్బంది, పోలీసుల సమాచారం అందించింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ బిడ్డను బయటకు తీశారు. శిశువును ఆసుపత్రిలోని పిల్లల వార్డుకు తరలించారు. చిన్నారికి చికిత్స చేసిన వైద్యులు.. పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. శిశువును సజీవంగా పాతిపెట్టిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారి వైద్యుల పర్యవేక్షణలోనే ఉందని శిశు సంరక్షణ అధికారులు తెలిపారు. జిల్లా ఆస్పత్రి పీడియాట్రిషియన్ డాక్టర్ సర్ఫరాజ్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

గుంతలో చిన్నారిని పాతిపెట్టిన విషయం మహిళ గుర్తించి, సకాలంలో సమాచారం ఇవ్వడం వల్లే శిశువు ప్రాణాలు దక్కాయని వైద్యులు తెలిపారు. బయటకు తీసిన వెంటనే చికిత్స ప్రారంభించామని పేర్కొన్నారు. పసి కందును బతికుండగానే పాతిపెట్టడానికి ఆ తల్లికి చేతులెలా వచ్చాయని, ఆమెకు మనసే లేదని మండిపడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like