వైద్యశాఖ‌కు స‌ర్జ‌రీ..

-వైద్యంపై నిఘా పెట్ట‌నున్న ప్ర‌భుత్వం
-పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు
-స‌ర్జ‌రీలు చేయాల్సిందే.. లెక్క చెప్పాల్సిందే
-ప్రభుత్వ వైద్యులకు నెలవారీ టార్గెట్లు
-పెద్దాసుప‌త్రుల‌కు రిఫ‌ర్ చేసి చేతులు దులుపుకునే ప‌రిస్థితి మారాలి
-మంత్రి హ‌రీష్‌రావు ప్ర‌త్యేక దృష్టి

వైద్యశాఖ‌కు స‌ర్జ‌రీ చేసేందుకు మంత్రి హ‌రీష్‌రావు పూనుకున్నారా..? స‌రిగ్గా ప‌నిచేయ‌ని వైద్యుల‌పై వేటు వేసేందుకు సిద్ధ‌మ‌య్యారా..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుంది. స‌ర్కారు వైద్యం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. అయినా వైద్య‌సిబ్బంది నిర్ల‌క్ష్య‌ధోర‌ణి కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు చాలా చోట్ల స‌రైన వైద్యం అంద‌డం లేదు. దీంతో ఈ అంశంపై మంత్రి దృష్టి సారించారు.

ఇష్టారాజ్యం ఇక కుద‌ర‌దు..
డాక్ట‌ర్లు చాలా మంది త‌మ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో వైద్యులదే ఇష్టారాజ్యంగా నడిచింది. కొందరు డ్యూటీలో ఉన్నట్లు చూపిస్తూనే డుమ్మా కొట్టేవాళ్లు ఉన్నారు.. ఇక నుంచి ఇలా డుమ్మా కొట్టేవారి ఆటలు సాగ‌కుండా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. పీహెచ్‌సీల్లో వైద్యంపై నిఘా పెట్టేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఏప్రిల్‌ మొదటివారంలో ప్రతీ పీహెచ్‌సీల్లోనూ సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా విధుల‌కు ఎవ‌రు హాజ‌ర‌వుతున్నారు..? ఎవ‌రు డుమ్మా కొడుతున్నారు..? తెలిసిపోనుంది.

స‌ర్జ‌రీలు చేయ‌క‌పోతే వేటే..
ఇక నుంచి ప్రతినెలా స్పెషలిస్టు వైద్యులు తాము ఎన్ని సర్జరీలు చేసింది లెక్కలు చూపించాల్సిందేన‌ని ఆదేశించింది. దీంతో ప్రతి డాక్టరూ నెలకు కనీసం ఒక ఆపరేషన్ అయినా చేయాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. కనీసం ఒక్క సర్జరీ కూడా చేయకపోతే సదరు వైద్యుడిపై వేటు వేయ‌నున్నారు. దీనికి సంబంధించి వైద్య విద్య సంచాలకుడు, తెలంగాణ వైద్యవిధానపరిషత్‌ ఆస్పత్రుల పరిధిలోని వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రధానంగా స్పెషలిస్టు వైద్యులకు ఈ ఆదేశాలు ఎక్కువగా వర్తిస్తాయి. వారు ప్రతి నెలా శస్త్రచికిత్సలు చేయడాన్ని తప్పనిసరి అని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

లెక్క తేలుస్తారిలా..
ఆస్పత్రులకు వచ్చే ఓపీ, ఐపీ ఆధారంగా చేయాల్సిన కేసుల సంఖ్యను నిర్ధారిస్తారు. నెలలో కనీసం ఒక్క సర్జరీ కూడా చేయని వారుంటే అటువంటి వారిపై వేటు వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ప్రతినెలా ఒకటో తేదీ నాటికి ఆస్పత్రుల వారీగా ఓపీ, ఐపీ, సర్జరీల వివరాలను నివేదికలో పంపించాలని డీఎంఈ, టీవీవీపీ, డీహెచ్‌ హెచ్‌వోడీలను మంత్రి హరీశ్‌ ఆదేశించారు. మొదటి వారంలో వీటిపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదే స‌మ‌యంలో సర్జరీలు చేయకపోతే అందుకు గల కారణాలను వివరించాలి. ఒకవేళ ఆపరేషన్‌ థియేటర్‌లో ఎక్వి్‌ప్‌మెంట్‌ పాడైనా ఊరుకునేది లేదని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.. కొంతమంది వైద్య సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఎక్విప్‌మెంట్‌ను పాడు చేసి సర్జరీలకు దూరంగా ఉంటున్నారు.. దీంతో ఈ వ్యవహారంపై సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది..

అన‌వ‌స‌ర‌మైన రిఫ‌ర్లు వ‌ద్దు..
మరోవైపు జిల్లా స్థాయి ఆస్పత్రులు అక్కడే చేయాల్సిన సర్జరీలను కూడా గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రులకు పంపుతున్నారు. ఇక నుంచి అలా పంపడానికి వీల్లేదని వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. పెద్దాస్పత్రులకు రిఫర్‌ చేస్తే…అందుకు గల కారణాలను కూడా వివరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వారి స్థాయిలో చేయగలిగిన సర్జరీలను కూడా రిఫరల్‌ చేయడాన్ని సహించేది లేదని పేర్కొంది.. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్స్‌ పెరగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలను పెంచాలని ఆదేశించింది. దీనిని మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా పరిగణించారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌భుత్వ వైద్యం మారాల‌ని హ‌రీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మార‌క‌పోతే ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని మంత్రి స్ప‌ష్టం చేస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార‌క‌పోతే తానే స్వ‌యంగా రంగంలోకి దిగి మార్చాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like