సింగరేణి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలు ఇవే..
-చేసిన పనులు, సంక్షేమంపై టీబీజీకేఎస్ ప్రధాన దృష్టి
-సింగరేణిలో అప్పుడు-ఇప్పుడూ పోల్చుతూ కార్మికుల్లోకి
-కేంద్రం ప్రైవేటీకరణ ఆంశంపై ప్రత్యేక ఫోకస్
-ప్రభుత్వం, సింగరేణి అవినీతి గురించి మిగతా పక్షాలు
-కార్మికులను మోసం చేస్తున్నారంటూ గనుల వద్దకు వెళ్లనున్న యూనియన్లు
-రసవత్తరంగా మారనున్న సింగరేణి ఎన్నికలు
మంచిర్యాల : మరో రెండు నెలల్లో సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు అన్ని యూనియన్లకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. దాదాపు అన్ని పార్టీలకు అనుబంధ యూనియన్లు ఉన్నాయి. సింగరేణిలో ఇప్పుడు పాగా వేస్తే ఆరు జిల్లాల్లో ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏయే అంశాలను కార్మికుల్లోకి తీసుకువెళ్లి విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తాము చేసిన పనులు, సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఆ యూనియన్ సింగరేణివ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాల కల్పన ఆ యూనియన్‌కు కలిసిరానుంది. అదే సమయంలో కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులు సాధించామని యూనియన్ నేతలు చెబుతున్నారు. తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, మహిళలకు సైతం ఉద్యోగాల కల్పన ఇలా ఎన్నో రకాలుగా సాధించిన హక్కుల గురించి కార్మికులకు చెప్పనున్నారు. అన్నింటిని చెబుతూ కార్మికులకు అవగాహన కల్పించేందుకు టీబీజీకేఎస్ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
అదే సమయంలో సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణపై సైతం కార్మికులకు చెప్పనున్నారు. కేంద్రం నిర్ణయం వల్ల సింగరేణి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందని ప్రచారంలో ప్రధానాస్త్రంగా వాడుకునేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇదే ప్రధాన ప్రచారస్త్రం కానుంది. ఈ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరిస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దీనిపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముందుండి మూడు రోజుల పాటు సమ్ము చేసింది. అంతేకాకుండా, కార్మికులకు పాంప్లెట్ల ద్వారా సైతం గనులు, డిపార్ట్‌మెంట్లపై ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో దీనిని సైతం ఎన్నికల్లో ముందుకు తీసుకురానున్నారు.
ఇక ప్రభుత్వం, సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై మిగతా పక్షాలు దృష్టి పెట్టాయి. ఈ విషయంలో ఇప్పటికే భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధానంగా దృష్టి సారించింది. డీజిల్ కుంభకోణం, నైనీ బ్లాక్ టెండర్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రచారం చేయనున్నారు. నైనీ బ్లాక్ కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు సైతం చేశారు. ఇక నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంపై ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి నిధులను ఇష్టారీతిన వాడుకుంటోందని జాతీయ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా సీఅండ్ఎండీ శ్రీధర్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రామగుండంలో ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కళాశాలకు సింగరేణి నిధుల నుంచి రూ. 500 కోట్లు సీఅండ్ఎండీ శ్రీధర్ అందించారు. అలా ఇవ్వడం పట్ల కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రభుత్వం నిర్మించే ఆసుపత్రికి సింగరేణి నిధులు ఇవ్వడం ఏమిటని కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. ఇక సీఎస్ఆర్ నిధులు సైతం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఈ నిధులు సింగరేణి ప్రభావిత గ్రామాలకు వాడాలి. కానీ సిద్ధిపేటతో సహా ఇతర ప్రాంతాలకు నిధులు తరలిపోతున్నాయి. దీనిని సైతం ప్రచారంలో భాగం చేయనున్నాయి జాతీయ కార్మిక సంఘాలు.
ఇలా ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కార్మిక సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు లక్ష్యంగా ఇప్పటి నుంచే శస్త్రాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయా కార్మిక సంఘాలు కార్మిలకు దగ్గరకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సింగరేణి ఎన్నికలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకోనున్నాయి. అన్ని సంఘాలు తమ శక్తియుక్తులు ఒడ్డి ఇందులో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించనున్నాయి.