కార్మికుల హ‌క్కుల కోసం ఎంతటి పోరాటాల‌కైనా సిద్ధం

-ఇక గుర్తింపు సంఘ దుర్మార్గపు పాలనకు చెల్లు
-టీబీజీకేఎస్ నేత‌లు మ‌హిళా కార్మికుల‌పై అరాచాకాల‌కు పాల్ప‌డుతున్నారు
- సింగ‌రేణి ఎన్నిక‌ల్లో ఐఎన్‌టీయూసీని ఆదరించండి
- ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పిలుపు
- మొద‌టి రోజు ప్రారంభ‌మైన సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర

మంచిర్యాల : కార్మికుల హ‌క్కుల కోసం ఎంత‌టి పోరాటాల‌కైనా సిద్ధ‌మ‌ని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ స్ప‌ష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఖైరిగూడ ఓపెన్‌కాస్టు నుంచి ఐఎన్‌టీయూసీ ఆధ్వ‌ర్యంలో సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌క్ ప్ర‌సాద్ మాట్లాడుతూ అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు గనులను ఇతర అనేక సంస్థలను జాతీయం చేసింద‌ని తెలిపారు. వాట‌న్నింటిని ప్రభుత్వరంగా సంస్థలుగా నెలకొలిపి కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిద‌న్నారు. ఇప్పుడు ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంద‌న్నారు. అధాని, అంబానీలకు ధారాదత్తం చేసే లక్ష్యంతో పనిచేస్తున్న‌ద‌ని దుయ్య‌బ‌ట్టారు.

కేంద్రం.. రాష్ట్రం దొందూదొందే..
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వత్తాసు పలుకుతున్నదన్నారు. గ‌తంలో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకిస్తే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆ బిల్లుకు మద్దతు పలికారని ప్రశ్నించారు. అప్పుడు ప్రైవేటీకరణకు మద్దతు పలికి ఇప్పుడు ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ దొంగ ధర్నాలు, దీక్షలు చేస్తున్నార‌ని అన్నారు. సింగరేణిలో కార్మిక వర్గాన్ని అటు రాష్ట్ర ప్రజానీకాన్ని రాష్ట్రప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సింగరేణి కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేస్తుంటే టీబీజీకేఎస్ నాయకులు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం పైరవీలు చేసుకుంటూ తమ ఆస్తులు పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలిచిన నాటి నుంచి సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే ఎంపీల సిఫార్సు లేఖలతోనే సింగరేణిలో పాలన కొనసాగుతోంద‌న్నారు. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి పూర్తిగా తొత్తులుగా మారి వారికి ఏజెంట్లగా వ్యవహరిస్తున్నార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

మ‌హిళా ఉద్యోగుల‌కు ర‌క్ష‌ణ లేదు..
సింగరేణిని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా INTUC సిద్ధమన్నారు. ఇంత పెద్ద సంస్థలో మహిళా ఉద్యోగుల మానప్రాణాలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళా ఉద్యోగుల పై టీబీజీకేఎస్ నేత‌లు అరాచకాలకు పాలపడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. వారి సమస్యలను చెప్పుకోవడం కోసం మహిళ అధికారితో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్ ల‌ను టెండర్ ప్రక్రియ నుండి తొల‌గించాల‌న్నారు. నైనీ బ్లాక్ సింగరేణికే కేటాయించాలన్నారు.

కార్మికుల స‌త్తా చాటండి..
కొత్త బావులను తవ్వాలని, కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల‌కు మెరుగైన క్యాడర్ స్కీమ్ అమలు చేయాల‌న్నారు. గని ప్రమాదంలో మరణించిన కార్మికులకు అదనంగా కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికులకు కోల్ ఇండియాలో అమలులో చేస్తున్న‌ CPRMS స్కీము ప్రకారంగానే సింగరేణిలో చేయాల‌న్నారు. సింగరేణి ఉద్యోగుల ప్రాణాలను కాపాడాలని, బదిలీ వర్కర్లకు వారి వారి విద్యార్హతలను బట్టి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికులు తమ తడాఖ చూపెట్టాలని, ఈ సారి INTUCని ఆదరించాలని కోరారు.

కార్మికుల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చి..
అనంతరం జనక్ ప్రసాద్ ఓపెన్‌కాస్టు పీవో ను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి తగిన‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఖైరిగూడ వర్క్ షాప్, స్టోర్ లను సందర్శించి అక్కడి కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గురించి తెలుసుకుని వారికి అండగా INTUC ఉంటుందని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి ఏరియా జిఎం కార్యాలయాన్ని సందర్శించి అక్కడి ఉద్యోగుల సమస్యలను కూడా తెలుసుకున్నారు. అనంతరం జీఎంతో కలిసి ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కొరడమే కాకుండా చింతగూడ, గోలేటి ఓసీలను వెంటనే ప్రారంభించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కే.విశ్వప్రసాద్, ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు ఎస్.నరసింహా రెడ్డి, సిద్ధంశెట్టి రాజమౌళి, కేంద్ర ప్రధాన కార్యదర్శులు త్యాగరాజన్, పీ.ధర్మపురి,కాంపల్లి సమ్మయ్య, కేంద్ర ఉపాధ్యక్షులు పీ.రాజేందర్, జే.శంకర్ రావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, ఏరియా ఉపాధ్య‌క్షులు దేవి భూమయ్య, ఆల్బర్ట్, జాన్, కోట రవీందర్ రెడ్డి, నాయకులు ఎస్‌.జనార్ధన్, గరిగ స్వామి, మాధవ కృష్ణ,పల్లాస్, సంజీవ రెడ్డి,హుస్సేన్,బోడ తిరుపతి, కుక్కల ఓదేలు, స్వామి,పీ.సత్యనారాయణ,కోటేష్,రాజేష్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గణేష్ రాథోడ్, కేవీ. ప్రతాప్, జిల్లాల స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like