చెవికమ్మలు ఇవ్వలేదని చంపేసిన కొడుకు..

కన్న తల్లిని కిరాతకంగా హతమార్చాడో కసాయి కొడుకు. బైక్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి గొంతునులిమి అమానుషంగా హత్య చేశాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన పోచవ్వ(76)కి నర్సింహులు, కుమార్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. బైక్ కొనుక్కోవాలని చిన్న కొడుకు కుమార్ తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె చెవికమ్మలు తీసివ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కన్నతల్లి అనే కనీస కనికరం కూడా లేకుండా కిరాతకంగా హతమార్చాడు. పెద్ద కొడుకు నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిని గొంతునులిమి హత్య చేసినట్లుగా విచారణలో తేలిందని నిజాంపేట ఎస్సై తెలిపారు