మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఉద్రికత్త చోటు చేసుకుంది. సింగరేణి యాజమాన్యం తీసుకున్న చర్యల ఫలితంగా ఓసీపీ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.. వివరాల్లోకి వెళితే.. శ్రీరాంపూర్ ఓ.సి.పి. ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిపివేస్తూ గ్రామాల చుట్టూ సింగరేణి యాజమాన్యం కందకలు తవ్వుతోంది. దీంతో సింగాపూర్, తాళ్లపల్లి గ్రామాల ప్రజలు ఈ చర్యలను అడ్డుకున్నారు. తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండానే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను ఖాళీ చేయాలంటూ సింగరేణి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. కందకాలు తవ్వకుండా అడ్డుకున్న సింగపూర్, తాళ్లపల్లి, ముంపు గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారు. 30 మంది మహిళలను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు, మరో 40.మంది గ్రామస్తులను జైపూర్ పోలీసు స్టేషన్ తరలించారు. అయితే పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించే వరకు తాము గ్రామాలను విడిచిపెట్టి వెళ్లమని గ్రామస్తులు స్పష్టం చేశారు. తమను అరెస్టు చేసినా ప్రజాప్రతినిధులు, నేతలు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.