మళ్ళీ క్షిణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం..
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం సడెన్‌గా మళ్లీ లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు తెలిపారు. తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. లాలూ జీ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. మంగళవారం రాంచీలో చికిత్స పొందుతున్న సమయంలో ఇన్ఫెక్షన్ స్థాయి 4.5 గా ఉందని.. అనంతరం ఢిల్లీలో పరీక్షించినప్పడు అది 5.1కు పెరిగిందని తెలిపారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం పరీక్షించినప్పడు ఇన్ఫెక్షన్ స్థాయి 5.9కు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. దాణా కుంభకోణం, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో ఇటీవలే ప్రత్యేక సీబీఐ కోర్టు.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానాను విధించింది. దీంతో ఆయనను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్‌కు తరలించారు._