బొమ్మ అదిరింది…
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎట్టకేలకే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొవిడ్ కష్టాలను ఎదుర్కొంటూ నాలుగేళ్లపాటు శ్రమించి సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
కథ ఏమిటంటే…
ఆర్.ఆర్.ఆర్ కథ 1920లలో ఢిల్లీ పరిసర ప్రాంతాలలో నివసించే వారి నేపథ్యంలో సాగుతుంది. రామరాజు, భీమ్ ఇద్దరికీ చిన్న తనం నుంచీ పోరాడే తత్వం ఉంటుంది. రామరాజుకు పోలీస్ కావాలన్న ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గవర్నమెంట్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ అవుతాడు. ఇక భీమ్ తన జాతి గౌరవం కోసం శ్వాసనైనా విడిచే రకం. భీమ్ గోండు జాతికి చెందిన ఓ పచ్చబొట్లు పొడిచే పాపను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతోనే ఉంచుకుందామని తీసుకువెళ్తుంది. ఆ పాప తన తల్లిని చూడాలని ఆరాటపడుతుంది. ఆ పసిదాని తల్లి కూడా తన కన్నబిడ్డను చూసుకోవాలని తపిస్తుంది. అయితే తల్లిబిడ్డలను కలవకుండా చేస్తారు బ్రిటిష్ వారి సేవకులు, సైనికులు. ఇది తెలిసి భీమ్ ఎలాగైనా తమ గోండు పాపను రక్షించాలనుకుంటాడు. ఇదిలా ఉంటే ఓ సందర్భంలో ఇన్ స్పెక్టర్ రామ్, కొమరం భీమ్ కలుసుకుంటారు. వారిద్దరి మధ్య స్నేహం బలపడుతుంది. ముస్లిమ్ లాగా కనిపించే భీమ్, చలాకీగా ఉండే రామ్ ఇద్దరూ తమ అసలు లక్ష్యాలను చెప్పుకోరు. కానీ, వారి స్నేహబంధం మాత్రం చెరిగిపోనిది.
బ్రిటిష్ జనాన్నీ వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ఓ సందర్భంలో తమ డాన్సుల్లాగా మీ నాట్యం ఉండదు అని బ్రిటిష్ వాళ్ళు గేలి చేస్తారు. దాంతో ఈ ఇద్దరు మిత్రులు తమ ‘నాటు’ డాన్స్ తో రక్తి కట్టిస్తారు. ఇలా ఆనందంగా సాగుతున్న వారి స్నేహబంధాన్ని విధి విడదీసే ప్రయత్నం చేస్తుంది. తమ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న గోండు నాయకుడు భీమ్ ను పట్టుకోవాలని గవర్నమెంట్ భావిస్తుంది. అందుకు సరైన పోలీస్ ఇన్ స్పెక్టర్ రామ్ అని భావించి, అతణ్ణి నియమిస్తుంది. భీమ్ ను బంధించి తెస్తే, మరింత ఉన్నత స్థానానికి వెళతావనీ ప్రభుత్వం హామీ ఇస్తుంది. దాంతో రామ్ ఉత్సాహంగా భీమ్ ను పట్టుకొనే ప్రయత్నం మొదలు పెడతాడు. అలా రామ్ కు తన మిత్రుడే భీమ్ అన్న విషయం తెలుస్తుంది. అలాగే భీమ్ తన స్నేహితుడే బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ రామ్ అని తెలుసుకుంటాడు. తనను రామ్ మోసం చేశాడని భీమ్, తన వద్ద భీమ్ రహస్యం దాచాడని రామ్ భావిస్తారు. చివరకు తమ పోరుకు కారణం తమలోని స్నేహమే అని భావిస్తారు. రామ్ ఉద్యోగ ధర్మంతోనే తనతో పోరాడాడు అని అర్థం చేసుకున్న భీమ్ స్నేహానికి కట్టుబడి లొంగిపోతాడు.
రామ్ తనను బంధించడం వల్ల అతను ఉన్నతస్థానం చేరుకుంటాడని భీమ్ భావిస్తాడు. అలాగైనా బందీగా ఉన్న తమ జాతి అమ్మాయిని కలుసుకోవచ్చునని భావిస్తాడు. కానీ, ప్రభుత్వం భీమ్ కు ఉరిశిక్ష విధిస్తుంది. తన మిత్రుడు స్నేహం కోసం లొంగిపోతే, అతణ్ని ఉరితీయడం సరికాదనే వేదన రామ్ లో మొదలవుతుంది. జెన్నీఫర్ సూచించిన ఓ పథకం ప్రకారం రామ్, భీమ్ ను, గోండు జాతి పాపను రక్షిస్తాడు. చిన్నతనం నుంచీ తన బావ రామ్ పై పంచ ప్రాణాలు పెట్టుకున్న సీత అతను పెద్ద ఆఫీసర్ అయ్యాడన్న ఆనందంతో వస్తుంది. అయితే భీమ్ తప్పించుకోవడానికి కారణం రామ్ అని, అతణ్ని చిత్రహింసల పాలు చేస్తుంటారు బ్రిటిష్ సైనికులు. ఓ సందర్భంలో భీమ్, సీత కలుసుకుంటారు. ఆ సమయంలోనే పోలీస్ ఇన్ స్పెక్టర్ అయిన తన బావ రామ్ ను బ్రిటిష్ ఉద్యోగులు చిత్రహింసలు చేస్తున్నారని చెబుతుంది. మిత్రుడు భీమ్ ని రామ్ తప్పించాడనే తెల్లవాళ్ళు రామ్ ను చంపబోతున్నారని చెప్పి విలపిస్తుంది. అప్పటి వరకూ రామ్ తనకు మిత్రద్రోహం చేశాడని భావించిన భీమ్ అసలు విషయం తెలుసుకోగానే స్నేహితుణ్ణి విడిపించేందుకు పరుగు తీస్తాడు. అప్పటి దాకా వృత్తి ధర్మం అని భావించిన రామ్, తన జాతి కోసం తపించిన భీమ్, దేశం కోసం ప్రాణాలు పోయినా పరవాలేదని భావించి, తెల్లవారిని దేశం నుండి పారద్రోలే ప్రయత్నిస్తారు. విజృంభిస్తారు. బ్రిటిష్ వారి కీలక కేంద్రాలపై దాడులు సాగిస్తారు. ఎప్పటికప్పుడు తమ వ్యూహాలతో తెల్లవారిని చిత్తు చేస్తూ పోతారు. పరాయి పాలన నుండి దేశమాత దాస్యశృంఖలాలను ఛేదించడం కోసం రామ్, భీమ్ వంటి పోరాట యోధులూ ఉన్నారన్న సత్యాన్ని చాటుతూ కథ ముగుస్తుంది.
ఇక ఈ సినిమా మొత్తంలో ఇంటర్వెల్ సీన్ హైలెట్ కానుందట. ఈ మేరకు ట్వీట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వకుంటే ఒట్టు.. అగ్గిపెట్టేశారు.. ఊహించని ట్విస్టులెన్నో ఉన్నాయి. రామ్ చరణ్,ఎన్టీఆర్ అదరగొట్టేశారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-రామ్ చరణ్ ఇంట్రోడక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-రెండువేల మందితో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఉంటుందని తెలిసిందే.దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
-ఈ చిత్రం ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో ‘ఆర్ఆర్ఆర్’ అబ్బుర పరుస్తోంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. ఇక సినిమా అదిరిపోయింది.. ఎన్టీఆర్ దుమ్ములేపేశాడు.. రామ్ చరణ్ ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదంటూ మరో నెటిజన్ కామెంట్లు పెట్టేశాడు.