స్వామిదాస్‌పై బదిలీ వేటు
-RG-1 ఏరియా వర్క్ షాప్ లో మహిళ ఉద్యోగిని వేధించిన నాయకుడు
-విచారణ పేరిట కాలాయాపన చేసిన సింగరేణి అధికారులు
-పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
-ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం
స్వప్న అనే మహిళను వేధించిన కేసులో టీబీజీకేఎస్ మాజీ పిట్ సెక్రటరీ స్వామిదాస్‌పై బదిలీ వేటు పడింది. కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తుండటంతో నెల రోజుల కిందట స్వామి దాస్ ను చెప్పుతో కొట్టింది. అయితే స్వప్న ఫిర్యాదు స్వీకరించిన అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేశారు. విచారణ అధికారుల ముందే సాక్షులను సైతం స్వామి దాస్ బెదిరించడం, భయబ్రాంతులకు గురి చేయడం చేశాడు. అంతేకాకుండా, రోజు స్వప్నను డ్యూటీ వద్ద నివాస స్థలం వద్ద సైతం అడ్డగిస్తు స్వామి దాస్ మనుషులు స్వప్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఆమెను రాజీకి రావాల్సిందిగా మానసిక ఒత్తిడి కి గురి చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తన స్కూటీ పై వెళ్తున్న క్రమంలో అడ్డగించి ఆమెను బెదిరించారు. అమానుషంగా దాడి చేయటంతో పాటు, ఆమె కూతురుపై సైతం చేయి చేసుకున్నారు.
దీంతో స్వప్న శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో వర్క్ షాప్ గేట్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తోటి సహచర ఉద్యోగులకు సంబంధిత అధికారులకు తన పైన జరిగిన దాడిని వివరించారు. తనకు న్యాయం చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. పరోక్షంగా నిందితుడు స్వామిదాస్ పక్షం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ డైరెక్టర్లు, పర్సనల్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులతో సంప్రదించారు. సమస్య తీవ్రత నిందితుడైన స్వామి దాస్ ను బదిలీ చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో స్వామిదాస్‌ను సత్తుపల్లి ఏరియాకు బదిలీ చేస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇది కార్మికుల ఆందోళన పోరాట ఫలితమని, పోరాడే సంఘం వల్ల న్యాయం జరుగుతుంది అని అనడానికి ఇది నిదర్శనమని ఐఎన్టీయూసీ నేత జనక్‌ప్రసాద్ స్పష్టం చేశారు. నిందితుడు స్వామి దాస్ పై చర్యల ద్వారా కార్పొరేట్ యాజమాన్యం కార్మికులకు మనోధైర్యాన్ని కల్పించడం పట్ల INTUC హర్షం వ్యక్తం చేస్తుందన్నారు.