అది స్వార్థపూరిత రాజకీయ సమ్మె
-సింగరేణి ప్రైవేటీకరణ అవాస్తవం
-బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది
-కేంద్రం బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది
-ప్రధానిని ఎన్నోసార్లు కలిసిన కేసీఆర్ బొగ్గు బ్లాక్‌ల గురించి ఎందుకు అడగలేదు
-రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని దివాళా తీయడం తప్ప ఏం చేయలేదు
-సింగరేణి ఇక్కడ బొగ్గు వేలంలో పాల్గొనకుండా ఒడిషాలో ఎందుకు పాల్గొంది..?
-రెండు రోజుల సమ్మెలో పాల్గొనవద్దని కోరిన బీఎంఎస్

మంచిర్యాల : సింగరేణిలో ఈ నెల 28,29 తేదీల్లో జరుగుతున్న సమ్మె పూర్తిగా రాజకీయ స్వార్థ పూరిత సమ్మె అని భారతీయ మజ్దూర్ సంఘ్ నేతలు ఆరోపించారు. కేవలం టీఆర్ఎస్ తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఈ సమ్మె చేస్తోందని, దానికి జాతీయ కార్మిక సంఘాలు వంత పాడుతున్నాయని దుయ్యబట్టారు. బీఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ నాంది న్యూస్ తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే….
మన దేశానికి ఏటా దాదాపు 1,100 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. కోల్ ఇండియా 760 మిలియన్ టన్నులు, సింగరేణి 60 మిలియన్ టన్నులు, ఇతర ప్రైవేట్ సంస్థలు చేస్తున్న ఉత్పత్తి కలిపినా కూడా 850 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. సుమారు 250 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఉండటంతో విదేశాల నుంచి బొగ్గును దిగుమతిని చేసుకుంటున్నాం. అందుకు ఏటా రూ.2 లక్షల కోట్లను విదేశీ సంస్థలకు మనం చెల్లించాల్సి వస్తోంది. మన దేశంలో సహజ వనరులు ఉండి కూడా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం దేశానికి ఆర్థికంగా నష్టం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే గతంలో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణపై ఆలోచనలు జరిగాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 216 బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కేటాయించారు. అయితే ఎలాంటి బిడ్స్ లేకుండా, పారదర్శకత పాటించకుండా, దొడ్డిదారిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా బొగ్గు గనులను ఇష్టారాజ్యంగా అప్పజెప్పారు. అప్పుడు రూ.1.86 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిని అతి పెద్ద బొగ్గు కుంభకోణంగా కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తప్పుబట్టింది. దీంతో ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద కేసులు నమోదు అయ్యాయి. సుప్రీం కోర్టు ఈ 216 బొగ్గు బ్లాకుల కేటాయింపులు రద్దు చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వేసింది. ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ధ మెన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్, అఫ్ రెగ్యులేషన్ (ఎంఎండీఆర్) ఏమైండ్ మెంట్ యాక్ట్, 2015 బిల్లును ప్రవేశపెట్టింది.
ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా తెలంగాణా టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎంపీల మద్దతు తెలిపారు. కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్ తదితరులు మద్దతు చెప్పారు. అంటే సింగరేణిలో కూడా వేలం ద్వారానే బొగ్గు బ్లాకులు పొందాలని టిఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పుడే తెలుసు. కానీ, పార్లమెంట్ లో బొగ్గుగనుల చట్టసవరణకు మద్దతు తెలిపి. ఈ రోజు ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందనడం ద్వంద్వ వైఖరి అవలంభించడమే… ఇది కార్మికులను మోసం చేయడం కాదా…? సీఎం కేసీఆర్ … ప్రధాని మోడీ గారిని అనేకసార్లు కలిశారు. ఎప్పుడైనా సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు గురించి కాని, సింగరేణి కార్మికుల సమస్యల గురించి కాని ఒక్కనాడు కూడా మాట్లాడలేదు.
సింగరేణి కార్మికుల కష్టార్జితం చమట చుక్కలతో వచ్చిన డబ్బులను ఏటా తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేల కోట్ల వరకు రాయల్టీ ట్యాక్స్ ల పేరుతో పక్కదారి పట్టించింది. ఎన్నో పథకాలకు అనేక పేర్లతో సింగరేణి సంస్థ సొమ్మును అప్పనంగా వాడుకుంటోంది. రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు, రాష్ట్రానికి విద్యుత్ సరఫరా, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు ఏటా అభివృద్ధి పేరుతో కోట్లరూపాయల సింగరేణి సంస్థ నిధులు తీసుకుంటున్నారు. సంస్థ కోసం ఏ మాత్రం పని చేయడం లేదు. TRS ప్రభుత్వ అధికారం అడ్డం పెట్టుకొని సింగరేణిని దివాలా తీయడం తప్పా… ఏం చేసిందో చెప్పాలి..? సింగరేణి యాజమాన్యం కూడా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ కార్మిక సంఘాల ద్వారా సంప్ర దింపులు చేసి ఉంటే నాటినుండి 2019 నాటికి బొగ్గు గనులను సాధించి ఉండేది. కార్మికుల దృష్టిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవగా సృష్టించి. టీఆర్ఎస్ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలంలో పాల్గొన కుండా.. ఒడిశాలోని బొగ్గు గనుల కేటాయింపు కోసం సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొంటోంది.
13 వ విడత వేలంలో ఒడిశాలోని బొగ్గు గనుల కోసం సింగరేణి ఐదు బిడ్స్ వేసింది. మరి వేలం ద్వారా బొగ్గు బ్లాకుల కేటా యింపులకు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఒడిశాలో ఏ విధంగా బొగ్గు బ్లాకుల కేటాయింపు కోరుతోంది. చట్టం ముందు అందరూ సమానమే కదా… ఈ ప్రశ్నలకు సింగరేణి యాజమాన్యం, టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి జవాబు చెప్పే దమ్ముందా…? తాడిచెర్ల బొగ్గు గనుల అన్వేషణలో 40 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడేమో 80 మిలియస్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెబుతున్నారు. బొగ్గు గనుల వేలం వెనుక అవినీతి రాజకీయాలు దాగి సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలకు తెలుసు. రాబోయే రోజులో సింగరేణి కార్మికులు అవినీతి సంఘాలకు, అవినీతి అధికారులకు తగిన గుణపాఠం చెబుతారు. సింగరేణిని నిండా ముంచుతున్నది ఎవ్వరో కార్మికులకు తెలుసు… తెలంగాణ రాష్ట ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఎప్పటికైనా దోషులుగా నిలబడక తప్పదు. కార్మిక సంఘాలు రాజకీయ స్వార్ధం కోసం చేస్తున్న సమ్మె ఉచ్చులో పడి కార్మికులు మోసపోవద్దని బీఎంఎస్ విజ్ఞప్తి చేస్తోంది.