తాండూరు సీఐపై చర్యలు తీసుకోవాలి
-బీజేపీ నేతల ఆందోళన, రాస్తారోకో
-తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేత
మంచిర్యాల :బీజేపీ కార్యకర్త గుర్రం సాగర్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్న సీఐ జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. తాండూరు ఐబీ చౌరస్తాలో శనివారం రాస్తారోకో నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ కొయ్యడ హేమాజీ మాట్లాడుతూ తాండూరు సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకోవడం విచారకరమన్నారు. నిందితులను పట్టుకోవడం చేతగాని పోలీసులు బీజేపీ కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేయాలని పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరైతే నిందితులు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అని అన్నారు. ఈ విషయం తెలిసినా కూడా పోలీసులు వారిని తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా నెన్నల మండలంలో పెంబి శ్రీనివాస్ పై కూడా తప్పుడు కేసులు పెట్టారని, ఎంతో మందిపై ఇలా అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ప్రదీప్, మండల ఇన్చార్జీ రెవెళ్లి రాయలింగు, మండల ప్రధాన కార్యదర్శి విష్ణు కళ్యాణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, సీనియర్ నాయకుడు శేషగిరి తదితరులు పాల్గొన్నారు.