దుండగులపై చర్యలు తీసుకోవాలి
-రెండు వాహనాల నష్టపరిహారం చెల్లించాలి -జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి -దుండగుల చర్యలను ఖండించిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్
సీనియర్ పాత్రికేయుడు బద్రి వెంకటేష్ కారు అతని మోటార్ సైకిల్ పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని క్యాతన పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కలువల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలో జర్నలిస్ట్ వెంకటేశ్ సొంత కారు, మోటార్ సైకిల్ శనివారం అర్ధరాత్రి దగ్ధం చేసినట్లు ఆయన వివరించారు. ఇలాంటి చర్యలను ప్రెస్ క్లబ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో జర్నలిస్టులు కూడా పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిన్న రోజులను ఆయన గుర్తు చేశారు. బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆ నేరానికి పాల్పడిన దుండగుల పై కేసులు నమోదు చేసి శిక్షించాలని తెలిపారు. అలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ సమావేశంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ట్రెజరర్ రామిళ్ళ శ్రీనివాస్, కమిటీ సభ్యులు తూముల భవిష్యత్ పరికిపండ్ల రాజు వేల్పుల కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.