నవ్విపోదురు గాక…
-వివాదస్పదం అవుతున్న టీబీజీకేఎస్ నేతల తీరు
-ఆసుపత్రికి తన తల్లిని తీసుకువచ్చిన సింగరేణి కార్మికుడు
-మందులు ఇవ్వకుండా తాత్సారం చేసిన ఫార్మాసిస్టు
-ఏఐటీయూసీకి రాజీనామా చేసి టీబీజీకేఎస్‌లో చేరాలని ఒత్తిడి
-వైద్యం ఆలస్యంతో మరణించిన కార్మికుడి తల్లి
-కార్మిక సంఘాల ఆందోళన
-ఫార్మాసిస్టును సస్పెండ్ చేసిన డిప్యూటీ సీఎంవో

మంచిర్యాల : అధికారం అండగా ఉంటే చాలు. ఏమైనా చేయవచ్చని భావిస్తారు కొందరు.. వాళ్లకి ఎదుటి వాళ్ల గురించి ప్రాణాలు గురించి సైతం లెక్కలేదు. అనుకున్నది సాధించుకోవాలని అనుకుంటారు. ఇది కూడా ఇలాంటి ఘటనే.. సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల తీరు అలాగే తయారయ్యింది. ఓ వైపు ప్రాణాలు కొన ఊపిరితో ఉన్నా వాళ్లకు రాజకీయమే కావాల్సి వచ్చింది. దీంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.. వివరాల్లోకి వెళితే…
ఈ నెల 27న రెడ్డి సారయ్య తన తల్లి రత్నమ్మ ఆరోగ్యం బాగా లేదని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆయన కూడా అదే ఆసుపత్రిలో కుక్‌గా పనిచేస్తున్నారు. వైద్యుడు రాధాకృష్ణ ఆమెను పరీక్షించి ఇంజక్షన్లు, మాత్రలు రాసిచ్చారు. ఆ ఇంజక్షన్లు, మాత్రల కోసం ఆసుపత్రిలోని మెయిన్ స్టోర్‌కు వెళ్లి ఫార్మాసిస్టు స్వరూపారాణి అడిగారు. అయితే ఫార్మాసిస్టు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏఐటీయూసీ సంఘానికి రాజీనామా చేసి టీబీజీకేఎస్‌లోకి వస్తేనే వాటిని ఇస్తానని తనను ఇబ్బందులకు గురి చేసినట్లు సారయ్య వెల్లడించారు. సకాలంలో మందులు అందించకపోవడంతో రత్నమ్మ బుధవారం మృతి చెందారు. దీంతో ఫార్మిసిస్టుపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు.
కార్మిక సంఘాల ఆందోళన..
కార్మిక సంఘ నేతలు రెండు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఫార్మాసిస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం డిప్యూటీ సీఎంవోకు వినతిపత్రం అందించారు. అదేవిధంగా గురువారం సైతం ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫార్మాసిస్టును సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఏఐటీయూసీ నేతలు చిప్ప నర్సయ్య, తిరుపతి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫార్మాసిస్టు సస్పెన్షన్..
విధుల్లో నిర్లక్ష్యం వహించిన దారా స్వరూపారాణిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వరులు తేదీ 01-04-2022 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నేతలకు సంబంధించి కొద్ది రోజులుగా వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల వేధింపులపై సింగరేణి వ్యాప్తంగా చర్చ సాగుతోంది. తాజాగా తమ సంఘంలోకి రానందుకు ఒకరి ప్రాణం పోవడానికి కారణమైన ఫార్మాసిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.