టీబీజీకేఎస్‌పై అసత్య ప్రచారాలు
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంపై కొన్ని ప్రతిపక్ష సంఘాల నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అవి సరికాదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్.జి టు ఏరియా కమిటీ తెలిపింది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. TBGKSపై అసత్య ప్రచారాలు చేస్తూ మహిళా ఉద్యోగులను కించపరుస్తూ, భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. మహిళా ఉద్యోగులకు భద్రత లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలు ఉద్యోగం అంటే భయపడే విధంగా కొన్ని పత్రికల ద్వారా అసత్య ప్రచారాలు చేయించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో మహిళలు సమానం అని కోల్ ఇండియా లో సైతం లేని విధంగా సింగరేణిలో మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంపై గెలవాలంటే అసత్య ప్రచారాలు కాకుండా, TBGKS చేస్తున్న అభివృద్ధి పనులకు పోటీగా వేజ్ బోర్డు లో కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను కార్మికులు నమ్మే స్థితిలో లేరన్నారు. ఒకవేళ మహిళల పట్ల కానీ, కార్మికుల పట్ల మా నాయకులు తప్పు చేస్తే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వారిపై చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గతంలో ఆరోపణలు వచ్చిన వారిని యూనియన్ నుంచి బహిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారిపై శాఖ పరమైన చర్యలకు ఆదేశించిచారు తప్ప వారిని కాపాడే ప్రయత్నం చేయదని తెలిపారు. ప్రతిపక్ష సంఘాల నాయకులు ఇలాంటి నీచ సంస్కృతి ఇప్పటికైనా మానుకోవాలన్నారు. కార్మికులు మిమ్మల్ని మీ సంఘాలను ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇలాంటి నీచ అబద్దాలు ప్రచారం చేస్తున్న తప్పుడు సంఘాలకు కార్మికులే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.