700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం
-ఈ ఏడాది 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
-రికార్డు స్థాయిలో 26 వేల కోట్ల టర్నోవర్
-గత ఏడాదితో పోల్చితే బొగ్గు ఉత్పత్తిలో 28.6 శాతం వృద్ధి
-బొగ్గు రవాణా లో 35.1 శాతం వృద్ధి, ఓవర్ బర్డెన్ తొలగింపులో 20.1 శాతం వృద్ధి
-ఉద్యోగులకు అభినందనలు తెలిపిన సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్
-దేశంలో నెంబర్ 1 స్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
-సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ద్వారా రూ.130 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా
మంచిర్యాల : వచ్చే ఏడాది సింగరేణి సంస్థ 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకుంది. సంస్థ ఈ ఏడాది 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అలాగే చరిత్రలో సరికొత్త రికార్డుగా 26 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. రికార్డు స్థాయి ఉత్పత్తి, టర్నోవర్ సాధించిన నేపథ్యంలో సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు అభినందనలు తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం అన్ని విషయాల్లోనూ గణనీయమైన వృద్ధిని కనపరిచింది. 2020-21 లో 505 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన సింగరేణి, ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) లో 28.6 శాతం వృద్ధితో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. బొగ్గు రవాణాలో 35 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో 20.4 శాతం వృద్ధిని సాధించింది. అలాగే సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధికంగా సుమారు 26 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఇది అంతకు ముందు సంవత్సరం సాధించిన టర్నోవర్ 17,669 కోట్ల రూపాయల కన్నా 47 శాతం అధికం. కోల్ ఇండియా తో పోల్చినప్పుడు కూడా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా వృద్ధి శాతంలో అగ్రగామిగా ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి 127.9 లక్షల టన్నుల బొగ్గు రవాణా
సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన మొత్తం 650 లక్షల టన్నుల బొగ్గులో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం 127.9 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి అందజేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ జె.న్.కో.కు. కు 66.69 లక్షల టన్నులు, వివిధ రాష్ట్రాలలో గల 16 ఎన్.టి.పి.సి. విద్యుత్ కేంద్రాలకు 218.87 లక్షల టన్నులు, కర్నాటక పవర్ కార్పోరేషన్ కు 82 లక్షల టన్నులు, తమిళనాడు జె.న్.కో. కు 25.71 లక్షల టన్నులు, మహారాష్ట్ర జె.న్.కో. కు 29.79 లక్షల టన్నులతో పాటు మిగిలిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మొత్తం కలిపి 536.51 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. తద్వారా దక్షణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు సింగరేణి బొగ్గును రవాణా చేసి వెలుగులు అందించింది. ఇవి కాక సిమెంటు, సిరమిక్సు, పేపర్, స్పాంజ్ ఐరన్ వంటి ఇతర పరిశ్రమలన్నింటికి 118.79 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసి ఆ పరిశ్రమలు తమ ఉత్పత్తులు సాధించడానికి దోహదపడిరది.
కష్ట కాలంలో కూడా గణనీయమైన ఉత్పత్తి
సింగరేణి సంస్థ 2021`22 ఆర్థిక సంవత్సరానికి 680 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొని ప్రతీనెలా లక్ష్యాలను సాధిస్తూ వచ్చినప్పటికీ పేలుడు పదార్ధాల కొరత ఏర్పడి ఉత్పత్తి వేగానికి కొంత ఆటంకం కలిగింది. ఓపెన్ కాస్ట్ గనులలో ఓవర్ బర్డెన్ మరియు బొగ్గు పొరలు పేల్చడానికి వనియోగించే పేలుడు పద్ధాలలోని అమ్మోనియం నైట్రేట్ విదేశాల నుండి దిగుమతి చేసుకొనేవారు. యుద్ధ ప్రభావంతో పేలుడు పదార్ధాల కొరత ఏర్పడిరది. అయినప్పటికీ సి అండ్ ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ తీసుకొన్న ప్రత్యేక చొరవతో ప్రత్యామ్నాయ ఏర్పట్లతో బొగ్గు ఉత్పత్తి కొనసాగిస్తూ సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 650 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. సమస్య శాశ్వత పరిష్కారం కోసం సింగరేణి ఇప్పటికే తాను నిర్వహిస్తున్న రెండు పేలుడు పదార్ధాల ఉత్పత్తి యూనిట్లకు అదనంగా మంమదమర్రిలో మరో యూనిట్ ను ఐ.ఓ.సి. తో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఆర్థిక సంవత్సరంలో హైలైట్స్
సింగరేణిలోని 12 ఏరియాలలో కొత్తగూడెం, మణుగూరు, రామగుండం`2 ఏరియాలు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా 131.5 లక్షల టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, 119.4 లక్షల టన్నులతో మణుగూరు ఏరియా 2వ స్థానంలో, 84 లక్షల టన్నులతో రామగుండం`2 ఏరియా 3వ స్థానంలో ఉన్నాయి. సింగరేణి మొత్తం మీద అత్యధికంగా 73.49 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి జె.వి.ఆర్. ఓ.సి.2 అగ్రస్థానంలో ఉంది. 55.43 లక్షల టన్నులతో ఆర్.జి. ఓ.సి.3 రెండవ స్థానంలో, 55.03 లక్షల టన్నులతో పి.కె. ఓ.సి.2 మూడవ స్థానంలో ఉన్నాయి. మొత్తం 20 ఓపెన్ కాస్ట్ గనులలో 14 ఓపెన్ కాస్ట్ గనులు నూరు శాతం పైబడి లక్ష్యాలను సాధించాయి. భూగర్భగనుల్లో 6 గనులు నూరు శాతం పైబడి లక్ష్యాలు సాధించగా వీటిలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఐ.కె. 1ఎ ఇంక్లైన్ 188 శాతం లక్ష్యాల సాధనతో ప్రధమ స్థానంలో ఉండగా, కె.కె. 1 ఇంక్లైన్ 114 శాతంతో రెండవ స్థానంలో, ఆర్.కె. 5 ఇంక్లైన్ 105 శాతంతో మూడవ స్థానంలో ఉన్నాయి.
దేశంలోనే అత్యుత్తమ ప్లాంటుగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2021`22 ఆర్థిక సంవత్సరంలో 9,353 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి 8,808 మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ రాష్ట్ర పవర్ గ్రిడ్ కు సరఫరా చేసింది. 2021`22లో దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అత్యుత్తమ పి.ఎల్.ఎఫ్.తో అగ్రస్థానంలో నిలిచింది. 2021 నవంబర్, 2022 మార్చిలో నూరు శాతం పి.ఎల్.ఎఫ్. ను సాధించింది. ప్లాంటు నిర్వహణలో బెస్ట్ పవర్ ప్లాంట్, బెస్ట్ వాటర్ ఎఫిసియెన్సీ ప్లాంట్ అవార్డు, బెస్ట్ ఫ్లైయాష్ యుటిలైజేషన్ ప్లాంట్ వంటి పలు జాతీయ స్థాయి అవార్డులు అందుకుంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభం నుండి ఇప్పటి వరకూ 48,448 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా దానిలో 45,537 మిలియన్ యూనిట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు అందించగలిగింది.
సోలార్ ప్లాంట్ల ద్వారా 130 కోట్ల రూపాయల విద్యుత్ ఖర్చులు ఆదా
సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల నెలకొల్పిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు మార్చి 31వ తేదీ నాటికి 266.37 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. తద్వారా సింగరేణి సంస్థ చెల్లిస్తున్న విద్యుత్ బిల్లులలో 130.20 కోట్ల రూపాయల వరకూ ఆదా జరిగింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి : సిఅండ్‌ఎం.డి శ్రీ ఎన్.శ్రీధర్
ఈ సందర్భంగా సంస్థ సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో 5 కొత్త గనులను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించోతున్నామని, ఒడిస్సాలోని నైనీ బ్లాకు నుండి కూడా ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాబోతుందని తద్వారా 2022`23లో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించనున్నామని తెలిపారు. అలాగే ప్రస్తుత 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల స్థాయి నుండి 1500 మెగావాట్ల స్థాయికి కొత్త ప్లాంటులను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.