విద్యుత్ చౌర్యం.. చోద్యం చూస్తున్న అధికార గణం
మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. రాత్రి పూట కొత్తగా ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటున్న వాళ్లు, బోర్‌వెల్ యజమానులు తీగలకు కొండీలు తగిలించుకుని మరీ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. కాలేజీ రోడ్ ఏరియాలోని గోదావరి తీర ప్రాంతం పలు కాలనీల్లో, గద్దె రాగడి ప్రాంతాల్లో ఈ వ్యవహారం సాగుతోంది. ముఖ్యంగా రాత్రిపూట ఇలా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. దీంతో చాలా సందర్భాల్లో విద్యుత్ ట్రిప్ అయి రాత్రంతా తమకు కరంటు ఉండటం లేదని పలువురు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బోర్‌వెల్ యజమానులు ఏకంగా విద్యుత్ అధికారులతో డీల్ కుదుర్చుకుని మరీ సాగిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నిఘా పెట్టాల్సిన అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో ప్రజలను బాదడమే కాకుండా, ఇలాంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.