సీమాంధ్రుల చేతుల్లోనే సింగరేణి
-సీమాంధ్రుల చేతిలోనే సింగరేణి
-ఆంధ్రుల పెత్తనం పోవాలని తెలంగాణ ఉద్యమంలో ముందుకు ఉరికిన కార్మికులు
-తమ ఉపాధి కొల్లగొడుతున్నారని ఆందోళన
-ఇప్పుడు అన్ని విభాగాల్లో ఆంధ్రోళ్లదే పెత్తనం
-తెలంగాణ వచ్చి ఏం లాభమని నిరాశ,నిస్పృహలు
నీళ్లు, నిధులు, నియామాకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసింది సింగరేణి కార్మికులు.. వారిదే ప్రధాన పాత్ర. సింగరేణిలో ఆంధ్రుల ఆధిపత్యం సహించమని, తమను రాచి రంపాన పెడుతున్న ఆంధ్రుల పెత్తనం పోవాలని తెలంగాణ ఉద్యమ పోరాటంలో కార్మికులు ఉవ్వెతున్న కెరటాలై పోరాటం చేశారు. తెలంగాణ వచ్చింది.. కానీ ఆంద్ర ఆధిపత్యం పోలే.. పైగా కీలకమైన పదవులు అన్నీ వారికే దక్కుతున్నాయి.
సింగరేణి ప్రాంతం మొదటి నుంచి ఆంధ్ర ఆధిపత్యమే. ఇక్కడ కొలువుల్లో కింది స్థాయి ఉద్యోగులు అందరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైతే, క్లర్కు మొదలుకుని ఆ పై స్థాయి వాళ్లంతా ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే. దీంతో తమ ప్రాంతంలోనే తెలంగాణ ఉద్యోగులు నానా ఇబ్బందులకు గురి కావాల్సిన దుస్థితి. కావాలనే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉండేది. ఇక ఇక్కడ నుంచి నిధులు, బొగ్గు ఇతర ప్రాంతాలకు వెళ్లేది. పాలకులు సైతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కావడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు ముందుండి పోరాటం చేసింది అందుకే. తమ ప్రాంతానికి వచ్చి తిష్ట వేసిన ఆంధ్రా ప్రాంత అధికారులు తమపైనే ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ వస్తే వారి పీడ విరగడ అవుతుందని భావించారు.
తెలంగాణ వచ్చినా వారి ఆధిపత్యం పోలే..
కీలకమైన డిపార్ట్‌మెంట్ హెడ్‌లుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులే ఉన్నారు. కార్పొరేట్ ప్లానింగ్ & ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ప్రాజెక్ట్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్, ఓసిపి డిపార్ట్‌మెంట్, సిహెచ్‌పి డిపార్ట్‌మెంట్, సోలార్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎవాల్యుయేషన్ డిపార్ట్‌మెంట్, ఎనర్జీ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, హెచ్‌ఆర్‌డి డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, అంతర్గత ఆడిట్ విభాగం, డైరెక్టర్ల స్టాఫ్ ఆఫీసర్లు, విజిలెన్స్ జీఎం, వెల్ఫేర్ జీఎం, సెక్యూరిటీ జీఎం, పవర్ ప్రాజెక్ట్స్ చీఫ్, ఎస్టీపీపీలోని అన్ని హెచ్‌ఓడీ అధికారులు ఇలా అన్ని కీలక పదవులు సీమాంధ్ర అధికారులే. ముగ్గురు డైరెక్టర్లలో ప్రస్తుతం డైరెక్టర్ ఫైనాన్స్ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు (కాకినాడ).
మళ్లీ మా పాలనే
సీమాంధ్ర అధికారుల్లో ఈఅండ్‌ఎం అధికారులు మళ్లీ మా పాలన వచ్చిందని బాహాటంగానే చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అసలు పోరాటం జరిగిందే ఆంధ్రుల ఆధిపత్యం పోవాలని.. కానీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని పలువురు చెబుతున్నారు. అందుకే ఆ అధికారులు ఏం చేసినా..? ఎంత అవినీతికి పాల్పడినా కనీసం పట్టించుకోవడం లేదని దుయ్యబడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి సీమాంధ్ర అధికారుల అధీనంలోకి వెళ్తుందని ఊహించలేదని, తెలంగాణ రాష్ట్రంలో మనం కోరుకున్నది ఇదేనా అని కార్మికులు, తెలంగాణకు సంబంధించిన అధికారులు ప్రశ్నిస్తున్నారు.