జల్ జంగల్ జమీన్ కోసమే పాదయాత్ర

జల్,జంగల్,జమీన్ కోసమే ప్రాణహిత జలసాధన పాదయాత్ర అని డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం సిర్పూర్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రాణహిత జల సాధన పాదయాత్రలో భాగంగా రెండవ రోజు కాగజ్ నగర్ మండలం కోసినిలో మహాత్మ జ్యోతిబాపులే, సావిత్రిభాయి పులే విగ్రహాలకు పూలమాలలు వేసారు. అనంతరం మాట్లాడుతూ,. ప్రాణహిత ప్రాజెక్టు గురించి ప్రధానంగా ఈ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. ఆనాడు జల్, జంగల్, జమీన్ కోసం కొమురంభీం కొట్లాడిండు..కాని సొంత రాష్ట్రం ఏర్పడినంక ఈ మూడు విషయాలలో మనకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జల్ ..మన నీరు మనకు కాకుండా తరలించుకు పోతున్నరు. జంగల్,. అడవుల నుండి ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నరు.. జమీన్,. ఆదివాసుల పోడుభూములను వారికి చెందకుండా చేస్తున్నారని ఆయన ప్రజలకు వివరించారు.
దళితులకు, బీసీలకు ఏ ఒక్కరికీ ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వకుండా సిర్పూర్ ఎమ్మెల్యే నాలుగవ సారి ఓట్లు అడగటానికి వస్తున్నడుని ప్రజలను హెచ్చరించారు. ఇక్కడున్న మాలి కులస్తులకు ఎమ్మేల్యే కోనేరు కోనప్ప ఎస్టీ సర్టిఫికెట్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేశారని, ఇప్పటికైనా ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దన్నారు.
అన్ని రంగాలలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని, అందుకే ఈ రోజు జల్, జంగల్, జమీన్ కోసమే భారతీయ జనతాపార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. మన ప్రాణహిత ప్రాజెక్టును సాధించుకునేంత వరకు పోరాటం ఆపేది లేదని ప్రజలందరు ఏకమై ముందుకు సాగాలని వారు కోరారు.
ఈ ప్రాణహిత జల సాధన పాదయాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా. కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గోలెం వేంకటేశ్, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ వీరబద్ర చారి, పెద్దపల్లి కిషన్ రావు వివిధ మండలాల ప్రజలు పాల్గొన్నారు.