22 యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం
దేశంలో ఉన్న 22 యూ ట్యూబ్ ఛానళ్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధించింది. ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు నాలుగు పాకిస్థాన్‌కు చెందిన నాలుగు ఛానళ్లతో పాటు మొత్తం 22 యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేసింది. అయితే ఇందులో ఐటీ రూల్స్ ప్రకారం 18 భారత దేశానికి చెందిన ఛానల్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏఆర్పీ న్యూస్, ఏవోపీ న్యూస్, ఎల్డీసీ న్యూస్, సర్కారీబాబు, ఎస్ఎస్ జోన్ హిందీ, స్మార్ట్ న్యూస్, న్యూస్ 23 హిందీ, ఆన్లైన్ ఖబార్, డీపీ న్యూస్, పీకేబీ న్యూస్, సర్కారీ న్యూస్ అప్డేట్, ఆర్జే జోన్ వంటి ఛానల్స్ ఉన్నాయి. కాగా 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 78 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది.
ఈ ఛానళ్లు సోషల్ మీడియాను ఆధారం చేసుకుని దేశ భద్రతకు, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2021 ఐటీ రూల్స్ ఆధారంగా భారత దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేయడం ఇదే మొదటిసారి. నిషేధానికి గురైన యూ ట్యూబ్ ఛానల్స్‌కు 260 కోట్ల వ్యూవర్ షిప్ ఉంది. ఈ ఛానల్స్ పలు టీవీ ఛానళ్లకు సంబంధించిన లోగోలను, ఆ ఛానల్స్ యాంకర్ల ఇమేజ్‌లను ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు. దీని ద్వారా తాము చూపించేది ప్రామాణికమైన వార్తలే అని వీక్షకులను నమ్మించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది.