జేఈఈ మెయిన్ మరోసారి వాయిదా
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేసింది ఎన్టీఏ… ఏప్రిల్‌లో జరగాల్సిన మొదటి విడత జేఈఈ మెయిన్… జూన్‌కి వాయిదా వేశారు.. జూన్ 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. ఇక, మేలో జరగాల్సిన రెండో విడత పరీక్షలు జులై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది.. ఇక, తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొన్నటితో ముగిసిపోగా… నిన్నటి నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇతర పరీక్షలు కూడా జేఈఈ మెయిన్ సమయంలో ఉండడంతో.. కొంత ఆందోళన నెలకొంది.. దీనిపై ఎన్టీఏకు విజ్ఞప్తులు కూడా వెళ్లాయి.. ముఖ్యంగా.. సీబీఎస్‌ఈతో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, హయ్యర్ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్ తేదీలు కూడా ఉండడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.. ఈ నేపథ్యంలో ఎన్టీఏకు వినతులు వెల్లువెత్తాయి.. వాటికి పరిశీలించిన అధికారులు.. చివరకు పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.