వరి రైతుకు ఉరేస్తున్నరు..
-రైతుల కోసం అవసరమైతే మరో ఉద్యమం
-అంబానీ, అదానీ మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు
-రైతు వ్యతిరేక చట్టాలతో నడ్డి విరుస్తున్నరు
-తెలంగాణ వడ్లు కొంటరా..? కొనరా..? సూటిగా చెప్పాలి
-కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం వరి రైతుకు ఉరేస్తున్నదని, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్నదని ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ.బీ చౌరస్తాలో రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నఆయన మాట్లాడారు. కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కేంద్రం వరికి ఉరి వేస్తే వారికి ఘోరి కడుతామన్నారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులకు రైతుల సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్లకి అబద్ధాల మీద ఉన్న ప్రేమ ఆదుకోవడంలో ఉండదని తెలిపారు. అంబానీ, అదానిల మీద ఉన్న ప్రేమ అన్నం పెట్టే రైతులపై లేదన్నారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర మంత్రులు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని అది సమంజసం కాదన్నారు.
పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? సమాధానం చెప్పేదాకా బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వడ్లను కొంటరో? లేదో? సూటిగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం కుటిలనీతిని బయటపెట్టాలని, రైతులకు నిజం తెలియాల్సిందేనని బిజెపి నాయకులను నీలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వరికి కనీస మద్దతుధర వస్తదో, రాదో తెలియని ఘోరమైన పరిస్థితిని కేంద్రం సృష్టిస్తున్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు ధైర్యం కోల్పోకుండా, వారి ఆర్థిక పరిస్థితి దిగజారి పోకుండా ఉండాలంటే ఇతర పంటలు వేయాల్సిన అనివార్య పరిస్థితులు కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గ్రామాల్లో విస్తృత చర్చ పెట్టాలని, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు.
రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని అన్ని పథకాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని స్పష్టం చేశారు. గడచిన 7 1/2 ఏళ్లలో ఒక్క వ్యవసాయ రంగానికే 83,989 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఖర్చు చేశామన్నారు. రైతుల కోసం సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రైతు పంట రుణాల మాఫీ, రైతు బంధు సమితిల ఏర్పాటు గోదాముల నిర్మాణం ఇలా అనేక రైతు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రైతు బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. రైతుల కోసం అవసరమైతే తెలంగాణ ఉద్యమం కన్నా గొప్పగా ఉద్యమిస్తామని చెప్పారు. మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతకాలం కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి నష్టం జరగబోనివ్వమని హామీ ఇచ్చారు.
సింగరేణిని సైతం అంబానీ, అదానీలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుంటామన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. నిండు అసెంబ్లీ లో 80 వేలకు పైగా ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసిన దమ్మున్న సర్కార్ తమదేనని చెప్పారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, నడిపెల్లి విజిత్‌రావు, మంచిర్యాల జిల్లా TRS నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, DCCB, DCMS, రైతు సమన్వయ సమితి, అన్ని అనుబంధ సంఘాలు పాల్గొన్నారు.