ఆసుపత్రుల్లో కొనసాగుతున్న తనిఖీలు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ ఆదేశాలతో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం 19 ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేయగా, శుక్రవారం రెండో బృందాల వారీగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు ఐదు బృందాలు ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వారం రోజుల ముందు నుంచే జిల్లాలోని ప్రైవేటు ఆసుప్రతులు, ల్యాబ్‌లకు నోటీసులు అందించారు. ఆయా కేంద్రాలకు సంబంధించి అనుమతి, వైద్యులు, వారి విభాగాలు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఎంసీఐ అనుమతి ఉన్న సంఖ్య తదితర వివరాలు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నోటీసులు అందించారు. బుధవారం తుది గడువు విధించి గురువారం నుంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మొదటి రోజే ఏకంగా 19 ఆసుపత్రులు, ల్యాబ్‌లను సీజ్ చేయడంతో వారి అనుమతులు, ఇతర వ్యవహారాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. చాలా ఆసుపత్రులు నిబంధనలు తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ల్యాబ్‌లు సైతం ఎలాంటి అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ తనిఖీల్లో ఆసుపత్రి ఏ వైద్యుడి పేరుపై ఉంది..? ప్రస్తుతం ఎవరు ఉన్నారు..? ఏ ఏ వైద్యులు సేవలు అందిస్తున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై ఖచ్చితంగా వేటు వేయాలని పలువురు కోరుతున్నారు.