రోగిని పరామర్శించడానికి వచ్చి గాయాలపాలు
బెల్లంపల్లి :వేల కోట్ల టర్నోవర్.. వందల కోట్ల లాభాలు… కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల ఖర్చు.. సింగరేణి గురించి యాజమాన్యం పదే పదే ఊదరగొట్టే మాటలు. కానీ, వాస్తవాలు మాత్రం అలా లేవు. కార్మికులకు వైద్యం అందించడంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు సింగరేణి అధికారులు. కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలం చెందుతున్నారు. సింగరేణి ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. బెల్లంపల్లి ఏరియా మాదారం టౌన్ షిప్‌కు చెందిన సింగరేణి కార్మికుడు దుర్గం అశోక్ తల్లి రాజమ్మకు షుగర్ ఎక్కువ కావడంతో రెండు రోజులుగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఫీమెల్ వార్డులో చికిత్స పొందుతుండగా తనను పరామర్శించేందుకు దగ్గర బంధువైన సరోజ మందమర్రి నుంచి వచ్చారు. వారు మాట్లాడుతుండగా పై నుంచి ఫ్యాన్ పడటంతో తలకు, చేతికి గాయాలయ్యాయి. దీంతో సరోజకు చికిత్స చేసి పంపించారు. అధికారుల నిర్లక్ష్యంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలు తర్వాత కానీ ముందు కార్మికులు, వారి కుటుంబాలకు మంచి వైద్యం అందేలా చూడాని విజ్ఞప్తి చేస్తున్నారు.