ఉన్న హ‌క్కులు పోగొట్టిన ఘ‌న‌త వారిదే..

-వాళ్ల‌కు బుద్ది చెప్పేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారు
-టీబీజీకేఎస్‌ను విమర్శించే అర్హత జాతీయ కార్మిక సంఘాలకు లేదు
-60కి పైగా హ‌క్కులు సాధించిన ఘ‌న‌త మాదే
-టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య

జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల‌కు ఉన్న హ‌క్కులు పోగొట్టాయ‌ని, వాళ్ల‌కు బుద్ధి చెప్పేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నార‌ని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. ఓసీపీ త్రీ కృషి భవన్లో జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేజ్బోర్డు ద్వారా హక్కులు తీసుకురావాల్సిన జాతీయ కార్మిక సంఘాలు కార్మిక హక్కులను పోగొట్టడమే ధ్యేయంగా పని చేస్తున్నాయని దుయ్య‌బ‌ట్టారు. కార్మికులను అన్ని ర‌కాలుగా ఆర్థికంగా న‌ష్టానికి గురి చేస్తున్న ఘ‌న‌త వారిదేన‌ని ఎద్దేవా చేశారు. పెన్షన్ అదనపు రికవరీ ఒప్పుకోవడమే కాకుండా పెన్షన్ పెరుగుదలకు కనీస ప్రతిపాదన చేయకపోవడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు.

గతంలో జీతం లీవులు సంవత్సరానికి ఎన్నిసార్లైనా పెట్టుకునే అవకాశం ఉండగా, జాతీయ కార్మిక సంఘాలు మూడు సార్లు మాత్రమే లీవ్ పెట్టుకోవచ్చని అగ్రిమెంట్ చేసుకున్నార‌ని ఇది సిగ్గుమాలిన చ‌ర్య అన్నారు. సిక్కు లీవులు, సిఎల్ లు దిగిపోయే సంవత్సరంలో ఎన్ని నెలల సర్వీస్ ఉంటే అన్ని మాత్రమే పెట్టుకునేలా ఒప్పందం చేసుకోవడం కార్మిక వర్గాన్ని మోసం చేయడం కాదా..? అని ఈ సంద‌ర్భంగా వారిని ప్ర‌శ్నించారు. సీపీఆర్ఎంఎస్ ద్వారా రిటైర్ అయిన కార్మికులకు రూ. 8 లక్షల వరకే వైద్య ఖర్చులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం సిగ్గుచేటని దుయ్య‌బ‌ట్టారు. అదే అధికారులు 25 లక్షల రూపాయల వరకు నయా పైసా చెల్లించకుండా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. అంతే కాకుండా సంవత్సరానికి రూ. 36 వేల రూపాయలు వైద్య చికిత్స నిమిత్తం నగదు చెల్లింపు కూడా ఉందన్నారు. మ‌రి ఈ ఒప్పందాన్ని జాతీయ కార్మిక సంఘాలు బొగ్గుగని కార్మికులకు ఎందుకు ఇప్పించలేకపోయార‌ని అన్నారు. ఈ విష‌యంలో కార్మిక వర్గానికి వివరణ ఇవ్వాలని అన్నారు.

గతంలో గుర్తింపు సంఘాలుగా సింగరేణిలో ప్రాతినిథ్యం వహించి వారు 60కి పైగా హక్కులు పోగొట్టార‌ని, కానీ టీబీజీకేఎస్ రెండుసార్లు గుర్తింపు సంఘంగా 60కి పైగా హక్కులు తెచ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. తాము సాధించిన హక్కుల్లో వైఫల్యాలను వెతికే చిల్లర సంఘాలుగా జాతీయ సంఘాల నాయకులు వ్యవహరిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. వారికి బుద్ధి చెప్పేందుకు సింగ‌రేణి కార్మికులు సిద్ధంగా ఉన్నార‌ని హెచ్చ‌రించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్లకు సంబంధించిన వందమంది కార్మికులకు మల్లయ్య కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొట్టమొదటిసారిగా ఓసీపీ త్రీ కృషి భవన్ వచ్చిన సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆయ‌న‌ను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, దేవా వెంకటేశం,శంకర్ నాయక్, ఎట్టం కృష్ణ, చెరుకు ప్రభాకర్ రెడ్డి,ఐ. సత్యం, బేతి చంద్రయ్య, పైడిపల్లి ప్రభాకర్,సిరంగి శ్రీనివాస్,కర్క శ్రీనివాస్, మస్కుల అనిల్ రెడ్డి,దశరథం,రవీందర్ రెడ్డి,ఆవునూరి రాజేశం, మల్లికార్జున్, ఆకుల రాజయ్య, ప్రభాకర్ రెడ్డి, రవీందర్, భీముని సత్యనారాయణ,తోకల సమ్మయ్య, సూర్యశ్యామ్, సంజీవ్, రాజమౌళి, కొండయ్య,సదయ్య పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like