టీఆర్ఎస్ నేతల వేధింపులు.. తల్లీ, కొడుకు ఆత్మహత్య
టీఆర్ఎస్ నేతల వేధింపులతో తల్లీ,కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. లాడ్జిలో తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్న వారు ఆత్మహత్యకు ఏడుగురు కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని, లేఖ కూడా రాశారు. లాడ్జిలో పొగలు రావడంతో సిబ్బంది పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మృతులు రామాయం పేటకు చెందిన సంతోష్, తల్లి పద్మగా గుర్తించారు. తల్లి వైద్యం కోసం 11న లాడ్జికి వచ్చారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్ పరిశీలించారు. ఆత్మహత్య చేసుకుంటునట్టు సెల్ఫీ వీడియో చిత్రీకరించి ఫేస్ బుక్ లో పెట్టినట్టు డీఎస్పీ తెలిపారు.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో బాసం శ్రీనుతో కలిసి సంతోష్ వ్యాపారం ప్రారంభించాడు. ఆ సమయంలో శ్రీను వద్ద డబ్బులు లేకపోవడంతో జితేందర్ గౌడ్ వద్ద అప్పు తీసుకున్నారు. మేం చేస్తున్న వ్యాపారం లాభాల బాట పట్టడంతో జితేందర్ గౌడ్ ఎంటరయ్యారని, వ్యాపారంలో 50 శాతం వాటా కావాలని డిమాండ్ చేయడంతో వీలు కాదని సంతోష్ చెప్పాడు. వ్యాపారం పూర్తయ్యాక గుడ్ వీల్ ఇస్తానని, చెబితే లేదు ఇప్పుడే కావాలని, పెద్ద మొత్తంలో నగదు కావాలని డిమాండ్ చేసి వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించారు. అప్పటి సీఐ నాగార్జున్ గౌడ్ జోక్యం చేసుకుని సంతోష్ ఫోన్ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పీఎస్‌లోనే ఉంచుకుని కేసులలో ఇరికించే ప్రయత్నం చేసే యత్నం జరిగిందన్నాడు.
దీనిపై మరుసటి రోజు మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫేస్ బుక్ సంబంధిత కేసులో నాకు సంబంధం లేదని చెబుతూ సీఐ ఫోన్ తిరిగి ఇచ్చేశాడని, కానీ తన ఫోన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని సీఐ నాగార్జున గౌడ్.. జితేందర్ గౌడ్‌కు ఇచ్చారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. తనపై బెదిరింపులు జరుగుతున్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా న్యాయం జరగలేదన్నారు. మొబైల్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని అడ్డం పెట్టుకుని మానసికంగా వేధింపులకు గురిచేశారని త తెలిపారు. ఏడాదికి రూ.1 లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయపన్ను కట్టేవాడినని, కానీ వేధింపులు మొదలయ్యాక ఆర్థిక నష్టాలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. ఆర్థిక నష్టాలు పూడ్చుకోగలను, కానీ నాతో పాటు కుటుంబాన్ని మానసికంగా కుంగిపోయేలా చేయడంతో పాటు స్నేహితుడు బాసం శ్రీనివాస్ నన్ను మోసం చేయడంతో తట్టుకోలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నామని సెల్ఫీ సూసైడ్ వీడియోలో సంతోష్ వివరించారు.