దళిత యువకుడికి.. మూత్రం కలిపిన మద్యం తాగించి..!
దళిత యువకుడిపై మరో ఇద్దరు యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. మద్యం తాగేందుకు నిరాకరించాడని.. దళిత యువకుడి చేతులు కట్టేసి.. మూత్రం కలిపిన బీరును తాగించారు. అనంతరం ఆ దళిత యువకుడిని తీవ్రంగా కొట్టి.. అతడి వద్దనున్న డబ్బును లాక్కొని పారిపోయారు.
హర్యానా లోని రేవారీలోని భైరాంపుర్ భడాగ్ని గ్రామానికి చెందిన దళిత యువకుడు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి పట్టణానికి వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తుషార్, రోహిత్ అనే యువకులు ఆ దళిత యువకుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం.. తమతో కలిసి మద్యం సేవించాలని ఒత్తిడి చేశారు.
ఆ యువకుడు నిరాకరించడంతో చేతులు కట్టేసి, దాడికి పాల్పడ్డారు. తాగిన మైకంలో విచక్షణ మరిచి.. బీరులో మూత్రం పోసి తాగించారు. దీంతో ఆ యువకుడు వాంతి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టి అతడి వద్దనున్న డబ్బులు, మొబైల్ ఫోన్ను లాక్కొని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గ్రామస్థుల సహయంతో ఆ యువకుడు బవాల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం.. రేవారీ హాస్పిటల్ కి తరలించారు.
బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.