ఇది తెలంగాణ ప్రజల ఆస్తి
టిఆర్ఎస్ పార్టీ ఏ వ్యక్తిదో, శక్తిదో కాదు యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు కేసీఆర్. హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే…
• ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచు కోట
• నిండైన, మెండైన శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టిఆర్ఎస్ పార్టీ.
• దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లోంచి ఎగిసిపడిన ఈ తెలంగాణ పతాకం టిఆర్ఎస్ పార్టీ.
• రాష్ట్రసాధనలో అనేక అవమానాలు, అనేక ఒడిదుడుకులు, ఛీత్కారాలు. అనేక విజయాలు, అపజయాలు ఎదుర్కొన్నాం.
• రాష్ట్రం సాధిస్తున్న విజయాలను మనకు మనం పొగుడుకోవాల్సిన అవసరం లేదు.
• కేంద్రం వెలువరిస్తున్నటువంటి ఫలితాలు, అవార్డులు, రివార్డులే దానికి తార్కాణం.
• నిన్న కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలేవంటే, 10 గ్రామాలకు 10 గ్రామాలే తెలంగాణ నుండి నిలిచాయి. మరో 20 గ్రామాలు తీసుకొని పరిశీలన చేస్తే 20 లో 19 గ్రామాలు ఉత్తమమైన గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం నుండి నిలిచాయి.
• తెలంగాణ పనితీరుకు ఈ ఫలితాలు మచ్చుతునక.
• ఒకనాడు కరువు, కాటకాలకు ఆలవాలమైన తెలంగాణ నేను జలభాండాగారంగా రూపుదిద్దుకున్నది.
• కాళేశ్వరంలో మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్ళు కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి.
• పాలమూరు-రంగారెడ్డి, సీతారామ రెండు ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే నలుచెరుగులా అద్భుతమైనటువంటి పసిడిపంటలతో అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతున్నదని నేను మీకు మనవి చేస్తున్నాను.
• కారుచీకట్ల నుండి వెలుగుజిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం.
• తాగునీటిరంగంలో, సాగునీటి రంగంలో, విద్యుత్తు రంగంలో, సంక్షేమరంగంలో ఇలా ఏ రంగం తీసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచాం.
• ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే వికెట్ నెంబర్ 1 పోయిందని పేపర్ వాళ్ళు రాసేది. కానీ ఆ రకంగా పోయే వికెట్లు తెలంగాణ మంత్రవర్గంలో లేవని నేను మనవి చేస్తున్నాను.
• కర్నాటక రాష్ట్రంలో ఓ మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోవడం మనం ఈ మధ్యకాలంలో చూశాం. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు.
• రెవెన్యూరంగంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి.
• ఎన్నో రాష్ట్రాలను అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని మనమే రెట్టింపు చేసుకొని 2 లక్షల 78 వేల రూపాయలకు చేరుకున్నాం.
• తలసరి విద్యుత్ వినియోగంలో, జీరో ఫ్లోరైడ్ కలిగిన రాష్ట్రంగా, ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించడంలో, ఇలా అనేక రంగాల్లో తెలంగాణ పురోగమిస్తున్నది.
• మనం పండించే ధాన్యాన్ని కేంద్రం కొనలేని అశక్తతను ప్రదర్శించే స్థాయికి మనం ఎదిగామంటే ఏ స్థాయికి తెలంగాణ వ్యవసాయం విస్తరించిందో, ఏ విధంగా తెలంగాణ పచ్చని పైర్లతో అలరారుతుందో అలవోకగా అర్థం చేసుకోవచ్చని మీకు మనవ చేస్తున్నాను.
• రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపి), దేశ జిడిపి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
• తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు జీఎస్డీపి సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేది. కానీ నేడు రెట్టింపు చేసుకొని 11 లక్షల 50 వేల కోట్లకు చేరుకున్నది.
• సుమారు 2.5 లక్షల పై చిలుకు ప్రభుత్వోద్యాగాలు కల్పించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.
• ఇంత అద్భుతమైన దేశంలో కొందరు దుర్మార్గమైన, సంకుచితమైన, ఇరుకైన విధానాలు దేశ ఉనికినే ప్రశ్నిం స్థాయికి, దేశ గరిమకు గొడ్డని పెట్టులా, ఆశనిపాతంలో దాపురించే స్థాయికి మనం పోతున్నాం.
• ప్రజల ఆశీర్వాదంతో రెండు టర్మ్ లు గెలిచాం.
• మొదటి టర్మల్ లో 50 కోట్ల మొక్కలు పెంచి, గ్రామ గ్రామానికి తీసుకుపోయి ఇచ్చాం. కానీ అనుకున్న రీతిలో పనులు జరగలేదు.
• రెండవసారి గెలిచిన తర్వాత పని జరగాలంటే ఏం చేయాలి అని ఆలోచించి చట్ట ప్రేరణ, శాసన ప్రేరణ ఉండాలి, విధులు నిర్లక్ష్యం చేసిన వారికి శిక్షలుండాలే అని కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాం.
• 12.769 గ్రామపంచాయతీలుంటే 12,769 పంచాయతీ సెక్రటరీలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించాం.
• పల్లె ప్రగతి అని పేరు పెట్టుకొని సంవత్సరానికి రెండు మూడు సార్లు డ్రైవ్ పెట్టి శాసనసభ్యులు, మంత్రలు, అందరం శ్రద్ధతో పనిచేస్తే ఈ రోజు 10 గ్రామాలకు 10 గ్రామాల్లో మనం ఫస్ట్ వచ్చాం. ఊరికే ఇది కాలేదు.
• ఓ సందర్భంలో ఇక్కడేదో సమావేశముంటే హాజరయ్యేందుకు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ మిత్రులు, జాతీయ నాయకులు నన్ను కలిసారు.
• దేశంలో మనందరం ఇప్పుడు ఏకం కావాలని వాళ్ళంటే ఎందుకని వాళ్లను నేనడిగాను.
• బిజెపీ పార్టీని గద్దెదించాలని వారి నుండి సమాధానం వచ్చింది. అది అందరి లక్ష్యం కావాలన్నారు. ఇది చెత్త ఎజెండా నేను మీతో రానని చెప్పాను.
• ఎవరినో గద్దె దించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో ప్రయత్నం జరగాలా. గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. రిలీఫ్ రావాల్సింది ప్రజలకు, పార్టీలకు కాదు.
• దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం లక్ష్యమంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం కాదు. ఒక పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదు.
• ఇవ్వాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నయా ఎజెండా.
• అద్భుతంగా దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోయే ఎజెండా కావాలె.
• మహబూబ్ నగర్ నుంచి సగం జనాభా 15, 16 లక్షల మంది అన్నమో రామచంద్రా అని చెప్పి వలసపోయేది.
• ఈ రోజు వలసలన్నీ రివర్స్ వచ్చేసాయి. ఏ వ్యక్తి కూడా తెలంగాణ నుంచి వలస పోవట్లేదు.
• ఇవ్వాళ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్నాటక మొదలైన 11 రాష్ట్రాల నుండి వలసలు మన దగ్గరున్నాయి. సుమారు 25 నుండి 30 లక్షల మంది అనేక రంగాల్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నారు.
• మా యువ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేయాలి అనే పేపర్లో వ్యాసం రాశాడు. ఇట్లా అనేక రకాల ఆలోచనలు చెలరేగుతున్నాయి.
• 20 ఏండ్ల క్రితం దిక్కు, దిశ దశలేని తెలంగాణ అయోమయ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ, ఒక పార్టీ ఒక నాయకత్వంలేని తెలంగాణ ఇవ్వాళ అద్భుతంగా ఏ దశకు చేరుకున్నదో అందికీ తెలుసు.
• దళితబంధులో మూడు కార్యక్రమాలున్నాయి. మూడు పార్శ్వాలున్నాయి.
• ఒకటి… 17.5 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా సంవత్సరానికి 2 లేదా 2.5 లక్షల చొప్పున ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయడం. కిస్తీలు లేవు. తిరిగి కట్టేది లేదు. బ్యాంకు లింకేజీ లేదు. వారికి నచ్చిన పని చేసుకునే వెసులుబాటు.
• రెండు.. ప్రభుత్వం లైసెన్స్ లు ఇచ్చే అన్ని రంగాల్లో వారికి రిజర్వేషన్లు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపుల్లో రిజర్వేషన్లు. హాస్టల్స్ సప్లైస్, హాస్పటల్ సప్లైస్ లో, వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించి అమలు చేశాం.
• దళితబంధు పథకం ద్వారా ఇచ్చే 10 లక్షల రూపాయలతో దళితబిడ్డలు ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
• ఇద్దరు, ముగ్గురు కలిసి పనులు చేసుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేవు.
• మూడు… దళిత రక్షణ నిధి. దీని ద్వారా తెలంగాణ దళితబంధు పథకం ద్వారా లబ్దిదారులకు ఇచ్చే 10 లక్షల రూపాయల్లో నుండి వారి రక్షణ కోసం 10 వేల రూపాయల తీసి, ప్రభుత్వం మరో 10 వేల రూపాయలు కలిపి వారి రక్షణ కోసం జమ చేస్తున్నది. బిపిఎల్ పరిధి నుండి ఎపిఎల్ పరిధిలోకి పోయినవారు తిరిగి ఏదైనా కారణాలతో బిపిఎల్ పరిధిలోకి వస్తే వారి రక్షణ కోసం ఈ నిధి ఉపయోగపడుతుంది.
• స్వర్గీయ ఎన్.టి.రామారావు నిష్కల్మషంగా ప్రజలకు ఏదన్నా మంచి చేద్దామని పార్టీ పెట్టారు. ఆ రోజు యువకులుగా మేము ఆ పార్టీలో పని చేశాం. ఎటువంటి కిరికిరి లేకుండా 200 మంది ఎమ్మెల్యేలతో ఆయన అధికారంలోకి వచ్చారు.
• ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి ఆయనను పదవి నుంచి తొలగించారు.
• తెలుగు ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి మళ్ళీ ఎన్.టి.రామారావును తిరిగి నియమించేదాకా పోరాడారు.
• తెలంగాణ కోసం అవసరమైన నాడు టిఆర్ఎస్ రూపంలో పెద్ద శక్తి పుట్టలేదా. గాలి దుమారం లేపలే. తెలంగాణ సాధించుకరాలే..
• అలాగే, దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టిచ్చి, తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉంటాయి.
• తప్పకుండా సముజ్వలంగా తెలంగాణ, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కూడా తప్పక అందులో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది.