టీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. రూ. 10 లక్షల ఫైన్లు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు భారీగా ఫైన్లు విధించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు భారీగా ఫైన్లు వేశారు. మంగళ,బుధవారాల్లో పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి ట్విట్టర్లో వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ.2 లక్షలకు పైగా ఫైన్ వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ.లక్షకుపైగా, మరో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు రూ.50 వేలకుపైగా ఫైన్లు వేశారు. మొత్తం ప్లీనరీకి సంబంధించి రూ.10 లక్షలకు పైన జరిమానాలు విధించారు. వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చినా నామమాత్రంగా కొన్నింటికి మాత్రమే ఫైన్లు వేసినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఈ టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరారు. రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు ఎలా పెడుతారని పాల్ ప్రశ్నించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని.. ఇప్పుడు ఎందుకు రూల్స్ ని బ్రేక్ చేశారని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలను పెట్టారని ఆరోపించారు. పార్టీ ఫ్లెక్సీలను తొందరగా తొలగించాలని పాల్ డిమాండ్ చేశారు.