బీజేపీలో రగులుతున్న భూ వివాదం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన ఓ భూదందా పెద్ద దూమారానికి దారి తీస్తోంది. జిల్లా అధ్యక్షుడు, అతని కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యవహారాలు ఆ పార్టీకి తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ భూ వ్యవహారం సైతం ఆ పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా అది ఓ కొలిక్కి రావడం లేదు.
ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో కొందరు నేతల వ్యవహర శైలి వివాదస్పదంగా మారుతోంది. ఇచ్చోడలో పాయల శంకర్, ఆయన బంధువులు భూములను కొనుగోలు చేశారు. గత ఏడాది కిందట ఇక్కడ ఓ భూమిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి టోకెన్ అడ్వాన్స్ కూడా ముట్టచెప్పారు. అది ఏజెన్సీ ఏరియా కావడంతో దానిని కొనేందుకు వారు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి అమ్ముకునే వాళ్లకు డబ్బులు అవసరం కావడంతో వారు డబ్బుల కోసం బీజేపీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పంచాయతీ కాస్తా ఎంపీ సోయం బాపురావు దగ్గరికి చేరింది.
రెండు రోజుల కిందట ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఎంపీ దగ్గరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తనయుడు శరత్ (బన్నీ), ఆయన అల్లుడు సిద్ధార్థ (సిద్దూ), జిల్లా పార్టీ అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి, భీంసరి సర్పంచ్ మయూర్, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు, గుడిహత్నూర్‌కు చెందిన ఆర్యన్, ఇచ్చోడ జడ్పీటీసీ బ్రహ్మానంద్ తదితరులు వెళ్లారు. ఈ విషయంలో గన్‌మెన్ లోపలికి వెళ్లి ఎంపీ సోయం బాపురావుకి చెప్పారు. ఆ విషయం తర్వాత మాట్లాడదామని గన్‌మెన్‌కు చెప్పి పంపించారు. అదే విషయాన్ని నేతలకు గన్‌మెన్ స్పష్టం చేయడంతో నువ్వేంటి.. చెప్పేదని అతన్ని తోసుకుని ఎంపీ బెడ్‌రూం వరకు వెళ్లారు. ఈ విషయంలోగన్‌మెన్లు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంపీ విషయాన్ని పార్టీ చీఫ్ బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు పాయల శంకర్, ఆయన బంధువుల ఆగడాలను సంజయ్‌కు వివరించారు. అది పార్టీ వ్యవహారం కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని పార్టీ చీఫ్ బండి సంజయ్ సూచించారు. నేతలపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో BJP జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ MP వద్దకు వెళ్ళి తన కుటుంబీకుల పై పోలీసుకేసులు నమోదైతే తన రాజకీయ భవిష్యత్తు సంకటంగా మారుతుందనే కోణంలో ప్రాధేయ పడటంతో కేవలం లోక ప్రవీణ్ రెడ్డిపై మాత్రమే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా ఈ అంశం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ముఖ్యంగా అధికార TRS కు చెందిన వారు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. BJP జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ఆయన అనుచరుల దౌర్జన్యంపై సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.