అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. ఆస్పత్రిలోనే శవం..
మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఆస్పత్రిలోనే శవాన్ని బంధువులు వదిలేసి వెళ్లిన హృదయ విదారక ఘటన జరిగింది. శవాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు 80 వేలు అడిగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో డెడ్ బాడీని విడిచిపెట్టే వారు వెనుదిరిగారు.
వివరాల్లోకి వెళ్తే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల మోతీషా ఓ వలస కూలీ. సోదరుడితో కలిసి ట్రైన్లో వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని సోదరుడు బెల్లంపల్లిలోని ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు మోతీషాను మంచిర్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో చేరిన రెండు గంటలకే మోతీషా మరణించాడు. మోతీషా డెడ్ బాడీని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు మోతీషా ప్రైవేట్ అంబులెన్స్ లను సంప్రదించాడు. ఈ డెడ్ బాడీని తరలించాలంటే రూ. 80 వేలు డిమాండ్ చేశారు.
ఆ డబ్బు చెల్లించే స్థోమత లేకపోవడంతో సోదరుడు మోతీషా డెడ్ బాడీని ఆసుపత్రిలోనే వదిలేశాడు. ఈ డెడ్ బాడీని తీసుకెళ్లాలని మోతీ షా సోదరుడికి ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. అయితే అతను స్పందించలేదు. ఈ విషయమై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోతీ షా సోదరుడి కోసం విచారణ చేస్తున్నారు.