ఈ చదువుల యజ్ఞాన్ని కొనసాగిస్తాం
ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
మంచిర్యాల : ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తనకు విద్యార్థుల కష్టం తెలుసునని, ఎవరూ పోటీ పరీక్షలకు దూరం కాకూడదని సంవత్సరం పాటు చదువుల యజ్ఞాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. బాల్క ఫౌండేషన్ సహకారంతో మందమర్రి, చెన్నూరులో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లను శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.సంకశాల మల్లేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థిక స్తోమత లేని వాళ్లకు, ఆడపిల్లలను సుదూర ప్రాంతాలకు వెళ్లి చదివించుకోలేని పరిస్థితుల్లో బాల్క ఫౌండేషన్ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. రెండు కోచింగ్ సెంటర్లలో కలిపి 2,300 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
నిష్ణాతులైన ఉపాధ్యాయులతో హైదరాబాదులోని కోచింగ్ సెంటర్ లకు ధీటుగా ఇక్కడి సెంటర్లను ఏర్పాటు చేశామని బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఉచిత కోచింగ్ తో పాటు, మధ్యాహ్న భోజనం, స్టడీ మెటీరియల్, నోట్ బుక్స్ బాల్క ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు.దూర ప్రాంత విద్యార్థులకోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అన్నం విలువ తెలిసిన వాడిగా కోచింగ్ వచ్చే ఎవరూ ఆకలితో అలమటించ కూడదనే సంవత్సరకాలం పాటు రెండు కూరలతో నాణ్యమైన భోజనం పెడతామని వెల్లడించారు. సుమారు 20 రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించిన కోచింగ్ సెంటర్లను తీర్చిదిద్దిన పోలీసుశాఖను ఆయన అభినందించారు.
రాష్టంలోని, విశ్వ విద్యాలయాల్లోని వివిధ అంశాల్లో నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రత్యేక భోదనా తరగతులు నిర్వహిస్తామన్నారు. మట్టిలో నుంచి మాణిక్యాలు పుడతారు అంటారని, అలాంటి మట్టిని చీల్చుకొని పుట్టే బొగ్గు నేలపై కూడా మాణిక్యాలు పుట్టాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టు “ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు” కాబట్టి మీరు ఎంచుకున్న మార్గం వెంట జంకు లేకుండా ప్రయాణించాలని యువతకు పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ యువత ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో సైతం ఇలాంటి అవకాశాలు ఉండవన్నారు. యూట్యూబ్ ఛానల్లు, క్వశ్చన్ బ్యాంక్ లంటూ అనవసరమైన మాధ్యమాల ద్వారా ఇబ్బందికి గురవుతారని స్పష్టం చేశారు. ఈ రెండు కోచింగ్ సెంటర్లకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ,ACP ఎడ్ల మహేష్, మున్సిపల్ కమిషనర్ రాజు పాల్గొన్నారు.