నేటి సమాజానికి పూలే దంపతులు ఆదర్శం

కాగజ్‌నగర్ : పూలే దంపతుల జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. బెజ్జుర్ మండల కేంద్రంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మండల టిఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. సోమవారం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ది కోసం కృషి చేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే అన్నారు. జ్యోతిరావు పూలే సతీమణిగానే కాకుండా సమాజంలో ఎన్నో గొప్ప మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేశారని వెల్లడించారు. పీడిత వర్గాల ప్రజల కోసం ఎంతో పోరాటం చేసి తన కంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకొని మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బెజ్జుర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి బాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.