నకిలీ పత్తి విత్తనాల వెనక పెద్దలు..
-బెల్లంపల్లి డివిజన్‌లో ఉన్న నాయకులే సూత్రధారులు
-నిక్‌నేమ్‌లతో సహా సోషల్ మీడియాలో హల్‌చల్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తివిత్తనాల అమ్మకాల వ్యవహారం వెనక పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కొందరు ప్రజాప్రతినిదులు, నేతలు వీటి వెనక ఉండి నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యంగా బెల్లంపల్లి డివిజన్లో ప్రతి ఏటా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసులు వీటిపై దృష్టి పెడితే పెద్దఎత్తున పట్టుబడతాయని పలువురు చెబుతున్నారు.
సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో మళ్లీ నకిలీ పత్తివిత్తనాలు జోరందుకున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలతో విత్తన వ్యాపారులు, జిన్నింగ్‌మిల్లుల నిర్వాహకులు, దళారులు ఈ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ఈ విత్తనాలను రైసుమిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో నిలువ ఉంచి, రైతులతో తమకున్న సంబంధాలను వినియోగించుకొని అంటగడుతున్నారు. ఓ వైపు పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నా.. మరోవైపు నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి.
జోరుగా నకిలీ విత్తనాల అమ్మకాలు..
జిల్లాలో పత్తి పంట సాగుకు అధిక శాతం రైతులు మొగ్గుచూపుతుంటారు. దాదాపు ప్రతి ఏటా 1.50 లక్షల ఎకరాల్లో ఈ పత్తి సాగువుతుంది. అది కూడా బెల్లంపల్లి డివిజన్‌లోనే అధికంగా సాగు అవుతుంది. దీనిని ఆసరగా చేసుకుని విత్తనాల వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. వారిపై పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి సారించడంతో వారు స్థానికంగా ఉన్న నేతలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా నేతలే ఈ విత్తన వ్యాపార రంగంలోకి దిగి ప్రతీ ఏటా కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకున వారిని నిండాముంచుతున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలతో పాటు, నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
నిషేధించినా యథేచ్ఛగా అమ్మకాలు..
జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలతో పాటు, నాసిరకం విత్తనాలకు రంగులు అద్ది నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. పర్యావరణం దెబ్బతినడం, క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం గ్‌లైసిల్ పత్తివిత్తనాలు, గ్లైఫోసెట్ మందులను నిషేధించింది. నిషేధించి సంవత్సరాలు గడుస్తున్నా అమ్మకాలను మాత్రం అరికట్టలేకపోతోంది. ఈ సీజన్‌లో మళ్లీ నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్ అమ్మకాలు గ్రామాల్లో జోరందుకుంటున్నాయి. వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు.
ప్రజాప్రతినిధులు, నేతల ఆధ్వర్యంలో విక్రయాలు..
అయితే బెల్లంపల్లి డివిజన్‌లో ఉన్న మండలాల్లో కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు వీటి వెనక ఉండి వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్లైతే ఏకంగా నేతలే ఈ నకిలీ విత్తనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. కొద్ది రోజుల కిందట భీమిని మండలంలోని ఓ రైస్‌మిల్లులో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం రాగా, తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే ఆ విత్తనాలు అక్కడి నుంచి తరలించినట్లు తెలుస్తోంది. మండలానికి చెందిన ఓ నేత నిక్‌నేమ్‌తో సహా నకిలీ విత్తనాల సూత్రధారి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
టాస్క్‌ఫోర్స్ జూలు విదిలిస్తారా..?
గతంలో అక్రమాలపై కొరఢా ఝళిపించేందుకు టాస్స్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. అయితే అందులో కొందరు చాలా చోట్ల డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కొత్తగా వచ్చిన సీపీ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన టీం ఈ నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు మేలు చేయాలని పలువురు కోరుతున్నారు.