చిక్కనంటున్న చికెన్
-చికెన్ ఆల్‌టైమ్ రికార్డు ధర
-రూ. 300కు దగ్గర..
రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. రిటైల్ చికెన్ షాపుల్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.300 వరకు అమ్ముతున్నారు. ఇక స్కిన్ ఉన్న చికెన్ కూడా రూ. 290 దాటిపోయింది. గతంలో ఎండా కాలంలో తగ్గే చికెన్ ధరలు కొన్నేండ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. పెండ్లిళ్లు కూడా ఉండడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, కోళ్ల పెంపకం తగ్గడం వల్లే షార్టేజ్ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వేసవి కారణంగా ఫారాలు కోళ్ల పెంపకాన్ని భారీగా తగ్గించాయి. దాని ప్రభావం ధరలపై పడుతోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రెండు రోజులు భారీ వర్షాలు కురిసినా, ఎండల తీవ్రత ఇంకా తగ్గకపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడం తదితర కారణాల వల్ల రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్ డిమాండ్‌కు సరిపడినంత చికెన్ లేనందున పది రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు.
చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగి ఏప్రిల్ 1నుంచి నెలాఖరు వరకు వడగాడ్పులు వీచాయి. గాలిలో తేమశాతం తగ్గడం, వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కింది. ఇది కోళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. మేత తక్కువగా తిని, ఎక్కువగా నీళ్లపై ఆధారపడడంతో కోళ్లు ఆశించిన బరువు పెరగలేదు.
వేసవిలో 45 రోజులకు సగటున కోడి రెండు కిలోలు అవుతుంది. కానీ ఇప్పుడది కిలోన్నర కూడా రావడం లేదని, ఫారంలోఉంచితే ఎండకు చనిపోతాయనే భయంతో వెంటనే అమ్మేస్తున్నారని తెలుస్తోంది. వర్షాలు లేక కూరగాయల దిగుబడులు తగ్గడం, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వ్యాపారాలు జోరందుకోవడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమైంది.
కాగా, ధరల పెరుగుదలకు కోళ్ల పరిశ్రమలో కంపెనీల గుత్తాధిపత్యమే కారణమని కొందరు రైతులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమలో 80 నుంచి 85 శాతం వాటా కంపెనీలదేనని, మిగిలిన 15-20 శాతమే రైతులు ఉన్నారని చెబుతున్నారు. దీనికితోడు చాలామంది రైతులు కోళ్లు పెంచి కంపెనీలకు అందిస్తున్నారు. అంటే పిల్ల, మేత, మందులు కంపెనీలు సరఫరా చేస్తుండగా… రైతులు కోళ్లు పెంచి తిరిగి అవే కంపెనీలకు అందజేస్తుంటారు.