రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య!
ఓ ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోవడం సంచలనం సృష్టించింది. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ శుక్రవారం తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇవాళ కోనసీమలో సీఎం పర్యటన ఉంది. పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన విధుల్లో పాల్గొని గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. రాత్రి తన ఇంట్లోనే గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వ్యక్తిగత కారణాలతో గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడా…? ఉన్నతాధికారుల వేధింపులు కారణమా…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు గోపాలకృష్ణకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అందుకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయ్యాక కొన్నాళ్ళు ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ విధులు నిర్వహించాడు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల వేధింపులు అధికం కావడంతో ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.