సింగరేణిలో మరో తెలంగాణ ఉద్యమం
-ఇంకా కొనసాగుతున్న సీమాంధ్ర ఆధిపత్యం
-లోలోపల రగుతున్న తెలంగాణ అధికారులు
-సంచలనం సృష్టిస్తున్న ఆన్‌లైన్ పిటిషన్
మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసింది సింగరేణి. తమ ఉద్యోగాలు సీమాంధ్రులు తన్నుకుపోతుంటే తట్టుకోలేక ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు 37 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మె విజయవంతం చేయడంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులదే కీలకపాత్ర. అయితే తెలంగాణ సాధించుకున్నా సింగరేణిలో మాత్రం సీమాంధ్ర పెత్తనం పోలేదని పలువురు స్పష్టం చేస్తున్నారు. కీలక పదవలున్నీ వారికే దక్కుతుండటంతో సింగరేణిలో మరో తెలంగాణ ఉద్యమం సాగుతోంది. అయితే, అది ఇప్పటి వరకు బయటకు రాకున్నా లోలోపల రగులుతోంది. ఎప్పుడో ఒకప్పుడు అది లావాలా పెల్లుబికే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
ఇంకా కొనసాగుతున్న సీమాంధ్ర ఆధిపత్యం..
సింగరేణిలో ఇంకా సీమాంధ్ర ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అన్ని కీలక విభాగాల్లో వారే కొనసాగుతున్నారు. కార్పొరేట్ ప్లానింగ్ & ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ప్రాజెక్ట్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్, ఓసిపి డిపార్ట్‌మెంట్, సిహెచ్‌పి డిపార్ట్‌మెంట్, సోలార్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎవాల్యుయేషన్ డిపార్ట్‌మెంట్, ఎనర్జీ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, హెచ్‌ఆర్‌డి డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, అంతర్గత ఆడిట్ విభాగం, డైరెక్టర్ల స్టాఫ్ ఆఫీసర్లు, విజిలెన్స్ జీఎం, వెల్ఫేర్ జీఎం, సెక్యూరిటీ జీఎం, పవర్ ప్రాజెక్ట్స్ చీఫ్, ఎస్టీపీపీలోని అన్ని హెచ్‌ఓడీ అధికారులు ఇలా అన్ని కీలక పదవులు సీమాంధ్ర అధికారులే ఉన్నారు. ఇక మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఉన్న STPP మళ్లీ పూర్తిగా సీమాంధ్ర ఆధిపత్యంలోకి వెళ్లింది.
ఆయన రాజీనామాతో కలకలం..
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తెలంగాణ శ్రీనివాస్ ను కక్షకట్టి ఆంధ్ర అధికారులు వేరే చోటికి బదిలీ చేశారు. తెలంగాణ ప్రాంతం వారు ఎవరైనా చురుకుగా ఉంటే వారిని బదిలీ చేస్తూ ఇబ్బందులకు గురి చే్స్తున్నారు. దానిని నిజం చేస్తూ నిబంధనలకు విరుద్దంగా తెలంగాణ శ్రీనివాస్‌ను నిబంధనలను పక్కన పెట్టి మరీ యాజమాన్యం విజయవాడలోని ఆప్మెల్ కంపెనీకి బదిలీ చేసింది. ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడ పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తనకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నా కనీసం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా బొగ్గు గనుల అధికారుల సంఘం (సీఎంఓఏఐ) కనీసం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆవేదనకు గురయ్యారు. ఆ సంఘానికి రాజీనామా చేసేశారు.
లోలోపల రగుతున్న తెలంగాణ అధికారులు..
ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులు లోలోపల రగిలిపోతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్థ మీద ఆంధ్ర పెత్తనాన్ని వారు సహించలేకపోతున్నారు. అయితే వారు ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థతి కనిపించడం లేదు. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సింగరేణి బిగ్‌బాస్ కూడా అటు వైపే ఉండటంతో ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సీమాంధ్ర ఆధిపత్యం బద్దలు కొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
సంచలనం సృష్టిస్తున్న ఆన్‌లైన్ పిటిషన్..
ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆన్‌లైన్ పిటిషన్ ఒకటి సంచలనం సృష్టిస్తోంది. సీమాంధ్రుల గుప్పిట్లో సింగరేణికి సంబంధించిన ఆన్‌లైన్ పిటిషన్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సీమాంద్ర ప్రమాదకర బారి నుంచి సింగరేణి తల్లీని విముక్తం చేసేందుకు సింగరేణిలో మళ్లీ ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దయచేసి పిటిషన్‌పై సంతకం చేయడం ద్వారా ఈ పవిత్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వండి. అంటూ అందులో పేర్కొన్నారు. ఇప్పుడు సింగరేణిలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సింగరేణిలో తెలంగాణ అధికారులంతా చర్చిస్తున్నారు. ప్రతిచోటా దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే ఇందులో సంతకం చేస్తే తమను మళ్లీ ఇబ్బందులకు గురి చేసి ట్రాన్స్‌ఫర్లు చేస్తారు..? చర్యలు తీసుకుంటారని భయపడుతున్నారు. కానీ మరికొంత మంది అధికారులు మాత్రం తెగించి సంతకం చేస్తున్నారు.