భవిష్యత్ మీది.. తపన మాది..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల :మీ భవిష్యత్ బాగుండాలని మేం తపన పడుతున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. చెన్నూరు జయశంకర్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత కోచింగ్ సెంటరును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో చదవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలలు కనాలని వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కష్టపడితేనే ప్రతిఫలం లభిస్తుందన్నారు. 95% ఉద్యోగాలు స్థానికులకే కల్పించిన ఘనత తెరాస ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, జోన్ల వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని ఆయన వెల్లడించారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ధనార్జన తప్ప కనీసం సిలబస్‌పై కూడా అవగాహన ఉండదన్నారు. పట్టుదల వదలకుండా చేసే మీ ప్రయత్నమే.. రేపటి మీ భవిష్యత్తును నిలబెడుతుందని చెప్పారు. ఒక ఉన్నత లక్ష్యాన్నిసాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను తప్పక పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. మీ గమ్యం చేరేవరకు ఇంటర్నెట్, సినిమాలాంటి విషయాలు పక్కనపెట్టి లక్ష్యంతో ముందుకు కొనసాగాలని బాల్క సుమన్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ భారతి హోళ్లికేరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.