నిర్మల్ జిల్లా వాసికి రాజ్యసభ సభ్యత్వం
నిర్మల్ : నిర్మల్ జిల్లా వాసికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం లభించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖులైన ఏలేటి నిరంజన్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూన్ 21తో ముగియనుండగా.. కొత్తగా ప్రకటించిన నలుగురిలో నిర్మల్ జిల్లాకు నిరంజన్ రెడ్డి ఉన్నారు.
నిర్మల్ జిల్లా సిర్గాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కొన్నేళ్లుగా హైద్రాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి ఏలేటి విద్యాసాగర్ రెడ్డి కూడా న్యాయవాదిగా పని చేశారు. వారి తల్లిదండ్రులు నిర్మల్ పట్టణంలో స్థిరపడగా.. ఇటీవల విద్యాసాగర్ రెడ్డి చనిపోయారు. వారికి నిర్మల్, పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉండగా.. పట్టణంలో స్థిరాస్తులున్నాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. జులై 22,1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జన్మించారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఆయనది. ఉన్నత విద్యంతా పూర్తిగా హైదరాబాద్‌లోనే సాగింది. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించారు.
ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు. ఏలేటి నిరంజన్ రెడ్డికి రాజ్యసభకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం పట్ల జిల్లాతో పాటు రాష్ట్రంలోని న్యాయవాదులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం లభించింది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా రాజ్యసభకు ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి అవకాశం లభించలేదు. రాజకీయ చరిత్రలో రాజ్యసభకు ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కనున్నారు. తెలంగాణకు చెందిన ఆయనకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించటం విశేషం. టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఉమ్మడి జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకులు సముద్రాల వేణుగోపాలాచారికి అవకాశం కల్పిస్తారనే చర్చ ఉంది.