టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) పేర్లను సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నుంచి సమాచారం రావడంతో వీరు ప్రగతిభవన్ కు బయలుదేరారు.
దామోదర్ రావు 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ – ఫైనాన్స్‌గా వ్యవహరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన దీవకొండ దామోదర్ రావు 1958 ఏప్రిల్ 1న జన్మించిన ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి హైదరాబాద్ ధనికుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయనపై ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, హెటిరో ల్యాబ్స్క చెందిన పార్థసారధి రెడ్డి, అతని కుటుంబం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 58వ స్థానంలో ఉన్నారు. 2018 వరకు హైదరాబాద్ ధనికుల జాబితాలో 81వ ర్యాంక్ లో ఉన్న ఆయన. కరోనా సమయంలో ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నారు.