కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలే..
మంచిర్యాల : తనకు, తన భార్యకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, ఇబ్బందులు పడుతున్నామని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ భాగ్యలక్ష్మితో కలిసి మాట్లాడారు. భాగ్యలక్ష్మి కి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నా అధికారాలు ప్రోటోకాల్ ఇవ్వలేదన్నారు. ఎన్నోసార్లు కేటీఆర్తో నా బాధను చెప్పుకునే ప్రయత్నం చేశానని, వాట్సప్‌లో మెసేజ్‌లు సైతం పెట్టానని అయినా స్పందించలేదన్నారు. ఎన్నికల్లో గెలిచినా నా చేతిలో డబ్బులు ఉండొద్దని నాతో కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిచాక తమపై బెదిరింపులకు పాల్పడ్డాడని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, టీఆర్ఎస్ కంటే మెరుగైన పార్టీ కాంగ్రెస్ అని ఓదెలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో గౌరవం కోసమే చేరానని వెల్లడించారు. నేను నా భార్య పిల్లలు టిఆర్ఎస్ పార్టీకి జిల్లా పరిషత్ చైర్మన్ కు, టీఆరెస్ కు రాజీనామా చేశామన్నారు. నియోజకవర్గంలో భవిష్యత్ నీదేనని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ సందర్భంగా నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రొటోకాల్ ప్రకారం కూడా తనకు విలువ లేదన్నారు. బాల్క సుమన్ ఆయన సొంత నిర్ణయాలతో వెళ్తున్నారని చెప్పారు. తమ ఇంటికి వచ్చే వారిపై కూడా నిఘా పెట్టారని అన్నారు. పార్టీలో కొనసాగడం వారికి ఇష్టం లేదన్నారు.