క్షమించండి..
-ఫ్యాన్స్‌ను క్షమాపణలు కోరుతూ జూ.ఎన్టీఆర్ బహిరంగ లేఖ
-ఇంట్లో లేనందుకు ఎవరినీ కలవలేకపోయానని వెల్లడి
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరోను కలవాలనే కోరిక అభిమానులకు నెరవేరలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు అర్ధరాత్రి నుంచే ఆయన హైదరాబాద్‌లోని ఇంటి వద్ద ఎదురుచూశారు. అక్కడే ఎన్టీఆర్ బర్త్ డే కేక్‌లు కట్టి చేసి.. తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జై ఎన్టీఆర్.. జైజై ఎన్టీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు.
టపాసులు పేల్చి హంగామా సృష్టించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. అభిమానులకు నచ్చజెప్పారు. అయినా వారు వినకపోవడంతో కాస్త లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లి.. కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలవలేకపోయినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతూ.. తారక్ లేఖ రాశారు. తాను ఇంట్లో లేకపోవడం వల్ల అభిమానులను కలవడం కుదరలేదని.. క్షమించాలని కోరారు. అభిమానుల ప్రేమకు తాను ఎప్పుడు కృతజ్ఞుడిని అని చెప్పారు. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనంటూ లేఖలో పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.