టీఆర్ఎస్తోనే అభివృద్ధి
-టూరిస్ట్ నాయకులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
-బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్దికి నా సహకారం ఉంటుంది
-ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
మంచిర్యాల :టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. బోయపల్లి బోర్డు నుంచి అంకుశం వరకూ రూ. 1.20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు నాకు రెండు కళ్లలాంటివని స్పష్టం చేశారు. బెల్లంపల్లి అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రూ. 1,500 కోట్లతో వార్ధా నది పై నిర్మించే బరాజ్ తో బెల్లంపల్లి నియోజకవర్గంలో 55 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకుల కబంధ హస్తాల నుంచి బెల్లంపల్లి నియోజకవర్గానికి స్వాతంత్రం తీసుకొచ్చిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బెల్లంపల్లి అభివృద్ధి లో పయనిస్తోందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన విపక్ష నేతలపై విమర్శలు సంధించారు. విపక్షాల దొంగ పాదయాత్రలతో పొర్లుదండాలుతో నిధులు రావని వెల్లడించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కృషి తోనే వివిధరకాల నిధులతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. టూరిస్ట్ నాయకులతో ఈ ప్రాంత ప్రజలకు ఒరిగేదేమీ లేదని, వారి దొంగ మాటలను ప్రజలు విశ్వసించ కూడదని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు పాత్ర, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గానికి నిధులు తీసుకువస్తున్నానని చెప్పారు.