ఆర్మీ జవాన్ ఇల్లు కబ్జా
-టీఆర్ఎస్ కార్యకర్త ఆక్రమించుకున్నాడని ఆవేదన
-ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని వెల్లడి
-తన ఇల్లు తనకు ఇప్పించాలని విజ్ఞప్తి
ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఉంటున్న తన ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్త ఆక్రమించుకున్నారని ఓ జవాన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బోథ్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న మహమ్మద్ అక్రం ఆర్మీజవాన్ గా పుల్వామా ప్రాంతంలో పని చేస్తున్నారు. తాను డ్యూటీకి వెళ్లిన సందర్భంలో యాకూబ్ ఖురేషి అనే టిఆర్ఎస్ కార్యకర్త ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాంపుర కాలనీలో 6-117/1 ఇంటి నెంబర్ (40/60) విస్తీర్ణం ఇంటిని గ్రామపంచాయతీ అధికారులతో కలిసి కుమ్మక్కై రికార్డులు తారుమారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బోథ్ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, దిక్కున్న చోట చెప్పుకో అని భయపెడుతున్నారన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అడగగా అది నీ ఇల్లు కాదు, నువ్వు అక్కడికి వెళ్ళవద్దు,ఆయన ఇల్లే, ఆయన కొన్నాడు అని మాట్లాడుతున్నాడని చెప్పారు. ఈ విషయంలో గ్రామపంచాయతీ ఈ ఓ, సర్పంచ్ లు సైతం ఎమ్మెల్యే ఇన్వాల్వ్ మెంట్ ఉంది కాబట్టి మేము మీ తరఫున మాట్లాడలేమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిని తనకు ఇవ్వాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.